అయిజ/శాంతినగర్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు ప్రజలంతా ముందుకు రావాలని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ కోరారు. వడ్డేపల్లి మండలం శాంతినగర్ పార్టీ ఆఫీస్ లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ అమలు కాని హామీలు ఇచ్చి తొమ్మిదేండ్లుగా ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. అలంపూర్ నియోజకవర్గంలో నేటి నుంచి వారం రోజుల పాటు 62 వేల ఇండ్లకు వెళ్లి 2.32 లక్షల మంది ఓటర్లను కలిసి ఆ రెండు పార్టీలు చేసిన అవినీతి, అక్రమాలపై చార్జిషీట్ అందజేసి, పోస్ట్ కార్డుపై సంతకం తీసుకుంటామని తెలిపారు.
పోస్ట్ కార్డుల ద్వారా అవినీతిని బయటపెడతామని చెప్పారు. నియోజకవర్గంలోని తుమ్మిళ్ల లిఫ్ట్, దాని పరిధిలో నిర్మించాల్సిన రిజర్వాయర్లు, సాగు నీటి వనరులు, ఆర్డీఎస్ కాలువల రిపేర్లు తదితర సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. అనంతరం ప్రోగ్రాం కరపత్రాలు రిలీజ్ చేశారు. ఏఐసీసీ అబ్జర్వర్లు సందీప్ కుమార్, సునీత ఐహోలీ పాల్గొన్నారు.