
హసన్ పర్తి,వెలుగు: పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ అవమానిస్తోందని ఏఐసీసీ సెక్రటరీ, రాష్ట్ర కో ఇన్చార్జి విశ్వనాథన్ పెరుమాళ్ విమర్శించారు. ఆదివారం హన్మకొండ జిల్లా హసన్ పర్తిలో ఆదివారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ను అవమానిస్తూ, రాజ్యాంగాన్ని కించపరిచేలా బీజేపీ, -ఆర్‌ఎస్‌ఎస్‌లు వ్యవహరిస్తున్నాయని, దీనిని ప్రజలకు తెలియజేస్తామన్నారు.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనలను కాపాడుకుంటూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను సమాజం క్షమిందని తెలిపారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. దేశంలోని పేద, బడుగు, బలహీనవర్గాల ఆకాంక్షలు నెరవేరడం లేదని, ప్రధానికి పేద ప్రజలకంటే బడా బాబులే ముఖ్యమని విమర్శించారు. కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, ఏఐసీసీ కో ఆర్డినేటర్ పులి అనిల్ కుమార్ పాల్గొన్నారు.
హనుమకొండ సిటీ: గాంధేయవాదం, అంబేద్కర్ సిద్ధాంతాలపై కేంద్రం దాడి చేస్తోందని ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ్ తెలిపారు. హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో ఆదివాసీ కాంగ్రెస్ బురియాడి సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందన్నారు. కాంగ్రెస్ గాంధేయ మార్గంలో నడుస్తుంటే కేంద్రంలోని బీజేపీ సర్కారు గూండా రాజకీయం చేస్తోందని విమర్శించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్ లో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ తో కలిసి శ్రమదానం చేశారు.