విశ్లేషణ: రాజకీయ లబ్ధి కోసమే వడ్ల డ్రామా!

ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్న ముచ్చట మరిచిన కేసీఆర్ స్వార్థ రాజకీయాల కోసం లక్షల మంది రైతుల జీవితాలతో చెలగాటం ఆడారు. వరి వేయవద్దని ఓసారి, వేయాలని మరోసారి చెప్పి అన్నదాతలను ఆగమాగం చేశారు. ఎనిమిదేండ్లుగా అవినీతి పునాదుల మీద నియంత పాలన సాగించిన కేసీఆర్ తన మీద, తన ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చి, మూడోసారి తెలంగాణను కబళించాలని కుట్ర చేస్తున్నరు. వరి కొనుగోళ్ల విషయంలో లేని సమస్య సృష్టించి, ఢిల్లీలో దొంగ దీక్షలు పేరు మీద రాజకీయ డ్రామా చేసి, కేబినెట్​ భేటీ తర్వాత తానే కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. నిరుడు ఆగస్టులో ఎవరినీ సంప్రదించకుండానే భవిష్యత్​లో బాయిల్డ్​ రైస్​ ఇవ్వబోమని లిఖిత పూర్వకంగా అధికారిక లేఖ రాసి ఇచ్చిన ఆయన తర్వాత యూటర్న్ తీసుకుని కేంద్రం బాయిల్డ్​ రైస్​ తీసుకోనంటోందని కయ్యానికి కాలు దువ్వారు. తెలంగాణ సమాజం, అన్నదాతలు కేసీఆర్​ కుట్రలు పసిగట్టి సామాజిక తెలంగాణ కోసం

జాగృతమవ్వాల్సిన సమయం వచ్చింది
బాయిల్డ్​ రైస్​ఇవ్వబోమని లెటర్ ఇచ్చింది కేసీఆర్, మోడీ ముందు చేతులు కట్టుకొని నిలుచున్నది కేసీఆర్, ఎవరైన వరి వేస్తామంటే ఉరి వేస్తామని ఐఏఎస్ అధికారులతో బెదిరింపులకు పాల్పడింది కేసీఆర్..  ఇన్ని రకాలుగా రైతులను ఇబ్బంది పెట్టిన ఆయన రైతుల కోసం ఢిల్లీలో దీక్ష చేయడం హాస్యాస్పదం. మొదటి నుంచి వరి కొనుగోలు సమస్య పరిష్కారం కావాలనే చిత్తశుద్ధి ఆయనకు ఏమాత్రం లేదు. నిజంగా రైతులపై ప్రేమ ఉంటే పార్లమెంట్​సెషన్స్​జరుగుతున్నప్పుడే ఢిల్లీలో దీక్ష ఎందుకు చేయలేదు? వరి కొనుగోళ్ల అంశం పార్లమెంట్​లో చర్చకు వచ్చేలా  ఎందుకు కృషి చేయలేదో చెప్పాలి. అన్నదాతను పావుగా వాడుకొని తెలంగాణని మూడోసారి దోచేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కుట్రలో భాగమే మొన్నటి దొంగ దీక్ష.  

ధర్నాలు చేస్తే రైతుల గోస తీరుతదా?
యాసంగి సీజన్ సన్నాహాలపై ఫిబ్రవరి 25, మార్చి 8న కేంద్ర ఆహార శాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈసారి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనబోదని, కొనుగోలు కేంద్రాలు ఉండవనే విషయం చెప్పడం గమనార్హం. యాసంగి ధాన్యం సేకరణకు సహజంగా మార్చి మొదటి వారంలోనే ఏర్పాట్లు చేయాలి. వడ్ల కొనుగోళ్లపై కేసీఆర్​కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? గోనె సంచులకు టెండర్లు, రైస్ మిల్లర్లకు కోటా కేటాయింపు, ట్రాన్స్ పోర్టేషన్ టెండర్లు తదితర ప్రక్రియను ఎందుకు పూర్తి చేయలేదు? సర్కారు వడ్ల కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ఇప్పటికే చాలా మంది రైతులు రెక్కల కష్టంతో పండించిన పంటను దళారులకు అమ్ముకొని నష్టపోతున్నారు. ఇప్పటికే 30 శాతం పంటను రైతులు నష్టానికి మిల్లర్లకు అమ్ముకున్నారు. మరి ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి. కేసీఆర్ కుట్ర రాజకీయాల వల్ల, కొనుగోలు ఆలస్యం వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం ఎవరు చేయాలి? తీరా రైతులందరూ నష్టపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి గ్రామంలో కొనుగోలు సెంటర్లు పెట్టి వడ్లు కొనుగోలు చేస్తుందని చెప్పడం ఎంత వరకు సమంజసమో ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

వెయ్యి కోట్లతో పోయేది 3500 కోట్లా? 
ఈ యాసంగిలో 80 లక్షల టన్నులు వడ్లు పండే అవకాశం ఉంది. ఇందులో 50 లక్షల టన్నుల ధాన్యం అమ్మకానికి వస్తుంది. వడ్లను మిల్లింగ్​ చేసిన తర్వాత కేంద్రం కోరినట్టుగా రా రైస్ ను మాత్రమే ఇస్తే ఈ 50 లక్షల టన్నుల్లో 7.5 లక్షల టన్నుల నూక వచ్చే చాన్స్​ఉంది. టన్నుకు రూ.  30 వేల చొప్పున రూ. 2100 కోట్లు విలువ ఉంటుంది. ఇందులో నూకలకు సగం ధర వస్తుంది. అంటే కేవలం వెయ్యి కోట్లు మాత్రమే నష్టం. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భరించొచ్చు. ఫుడ్​ కార్పొరేషన్ ​ఆఫ్ ​ఇండియాతో చర్చించి రూ.1000 కోట్లతో ముగించాల్సిన నష్టాన్ని రూ. 3500 కోట్లకు తీసుకెవెళ్లడం వెనుక కేసీఆర్​ అవినీతి ఉంది. యాసంగిలో వడ్లు మిల్లింగ్ చేస్తే 35 శాతం బియ్యం వస్తాయని సీఎం కేసీఆర్​ అంటున్నారు. దానికి కొలమానం ఏంటి? ఎఫ్​సీఐ, సివిల్​ సప్లయ్స్​ టెక్నికల్ ​టీమ్​తో టెస్ట్ ​మిల్లింగ్ ​చేయించారా? అన్ని సబ్జెక్ట్ లు కేసీఆరే  చెప్తే ఆ సబ్జెక్ట్ నిష్ణాతుల అవసరం ఇక లేదు కావొచ్చు.

కేసీఆర్ రైతులను అనేక రకాలు ఇబ్బందులు పెట్టి, రైతులు రెక్కల కష్టంతో పండించిన పంటలను దళారులకు అమ్ముకునే పరిస్థితులు తెప్పించి, రైతుల తరఫున దీక్ష చేస్తున్నట్లు నటించి, చివరకు కొంటున్నట్లు  ప్రకటించడం  విచారకరం. తెలంగాణ ప్రభుత్వం గత రెండు ఖరీఫ్​ పంటల్లో సేకరించిన దాదాపు 4 లక్షల ​ టన్నుల బియ్యాన్ని ఎఫ్​సీఐకి ఇంకా అందించలేదని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి అంటున్నారు. ఈ మాటలు నిజమైతే ఈ బియ్యం ఎవరి జేబులోకి పోయినయ్​? ఏ బ్లాక్​ మార్కెట్​లో అమ్ముడుపోతున్నయ్​. ఈ విషయం బయటకు రావాల్సిన అవసరం ఉంది. దీనిపై సీబీఐ విచారణ జరగాలి. ప్రభుత్వం డెలిబరేట్​గా మిల్లర్లతో కుమ్మక్కై  కొనుగోళ్లను ఆలస్యం చేయడం వల్ల రైతులు ధాన్యాన్ని మిల్లర్లకు తక్కువ ధరకు అమ్మకోవడంతో దాదాపు మూడు నాలుగు వేల కోట్ల రూపాయల వరకు నష్టపోయారు. 

ప్రత్యామ్నాయ పంటలకు ధరేది?
ఈ యాసంగిలో  వరి వేయొద్దన్న కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో వేలాది మంది రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేశారు. దాదాపు 10 లక్షల ఎకరాల్లో రైతులు శనగలు, కందులు, పల్లీ తదితర పంటలు సాగు చేశారు. తీరా పంటను మార్కెట్​కు తీసుకువెళ్తున్న రైతులకు కనీస మద్దతు ధర అందడం లేదు. తక్కువ ధరలకు అమ్ముకొని తీవ్రంగా నష్ట పోతున్నారు. ప్రభుత్వం చెబితే పంటలేసిన ఈ రైతులను ఆదుకోవాల్సింది ఎవరు? జాతీయ వ్యవసాయ విధానం కావాలని కేసీఆర్ తెలిసి కూడా, తెలియనట్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉన్నది జాతీయ విధానమే. అది కూడా భారత రాజ్యాంగం7వ షెడ్యూల్​కూ అనుగుణంగా1967లో జాతీయ వ్యవసాయ, ఫుడ్ పాలసీని ప్రవేశ పెట్టారు. రైతు పండించిన పంటను కనీస మద్దతు ధరతో కేంద్రమే కొనాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆయా కొనుగోళ్లకు అవసరం అయిన వెసులుబాటు కల్పించాలి. అర్థం పర్థం లేకుండా వన్ నేషన్ వన్ ప్రొక్యూర్​మెంట్ పాలసీ అని ఆగమాగం చేస్తున్నారు. రాష్ట్రంలో కేసీఆర్​ రాజకీయాలను అత్యంత దుర్మార్గంగా మార్చారు. ప్రతీది ఒక ఈవెంట్ మేనేజ్​మెంట్​లా చేస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే కేంద్రానికి వినపడదా ? అలా కాకుండా ఒక వేదిక, పెద్ద మైక్ సెట్లు, జనాలను హైదరాబాద్ నుంచి సమీకరించి ఒక ఈవెంట్ చేసి, దేశ్ కి నేత అనే నినాదాలతో ప్రజలను మభ్యపెట్టాలనే కుట్ర చేశారు. 

భూములు పడావ్​ పెట్టిన వారి పరిస్థితి? 
ఈ యాసంగి సీజన్​లో రైతులు వరి వేయొద్దని ప్రభుత్వం చెబితే వేలాది మంది రైతులు భూములు పడావ్​ పెట్టారు. ఇప్పుడు కొనుగోలు సెంటర్లు పెట్టి వడ్లు పండించిన రైతుల ధాన్యం కొంటానని సీఎం ప్రకటించారు. మరి ప్రభుత్వ మాటలు విని వరి వేయని రైతులకు పరిహారం ఎవరు చెల్లిస్తారు? రక్తాన్ని చెమటగా మార్చి అన్నం పెడుతున్న రైతన్నతో రాజకీయం చేయడం నీచాతి నీచం. ఇప్పటికైనా క్షుద్ర రాజకీయాలను పక్కన పెట్టి ప్రతి ధాన్యం గింజ కోనెలా కేసీఆర్ చర్యలు తీసుకోవాలి. అధికారాన్ని మరో సారి హస్తగతం చేసుకోవడం కోసం చేస్తున్న రాజకీయ కుట్రలకు చరమ గీతం పాడాలంటే, కేసీఆర్ ను గద్దె దించాల్సిందే. అమరుల త్యాగాలను గౌరవించే, ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం జరగాలంటే సమాజం జాగృతమవ్వాలి.

అవకాశవాద రాజకీయాలు
ఢిల్లీ దీక్షలో కేసీఆర్ రాకేశ్ టికాయిత్ ను పక్కన కూర్చోబెట్టుకోవడం ఆయన అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం. రాకేశ్ టికాయిత్ రైతు చట్టాలకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నప్పుడు కేసీఆర్ కనీసం మద్దతు తెలుపలేదు సరికదా మోడీతో కలిసి రైతు చట్టాలకు జై కొట్టారు. కానీ ఢిల్లీలో దీక్ష సందర్భంగా టికాయిత్ ను పక్కన కూర్చుబెట్టుకున్నారు. ఇంతకంటే అవకాశవాద రాజకీయం ఉంటుందా? రాకేశ్ టికాయత్ కు కూడా మతి తప్పిందో తెలియదు. స్వయంగా తాను హైదరాబాద్ లో దీక్షలో పాల్గొన్నప్పుడు ‘‘కేసీఆర్ రైతు ద్రోహి”అన్న టికాయత్ ఏమి మతలబ్ ​జరిగిందో కానీ కేసీఆర్ పక్కన ఢిల్లీ దీక్షలో కూర్చున్నరు. ఢిల్లీ దీక్షలో కేసీఆర్​మాట్లాడుతూ.. కేంద్రం స్పందించకుంటే వరి  సమస్యకు పరిష్కారం కూడా తన దగ్గర ఉందన్నారు. దీన్ని బట్టి సమస్య సృష్టించేది ఆయనే, పరిష్కరించినట్లు నటించేది ఆయనే అన్న విషయం గుర్తించాలి. గతంలో కూడా ఆర్టీసీ, ఫీల్డ్ అసిస్టెంట్లు, సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పీఆర్సీ, నోటిఫికేషన్స్ విషయంలో కూడా ప్రజలు ఎంతో హైరానా పడి, అనేక కష్టాలు ఎదుర్కొన్న తర్వాత చివర్లో.. ఆయా సమస్యలను పరిష్కరించినట్లు అహంకారంతో కూడిన వైఖరి ప్రదర్శించారు. రైతుల విషయంలోనూ అలాగే వ్యవహరిస్తున్నారు. 

– డా. దాసోజు శ్రవణ్, 
ఏఐసీసీ అధికార ప్రతినిధి