వరంగల్, వెలుగు : దేశంలో అవినీతిపోయి ప్రజాస్వామ్యం బతకాలంటే రాహుల్‍గాంధీ ప్రధాని కావాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి, పార్లమెంట్ ఎన్నికల తెలంగాణ ఇన్ చార్జి సుజాత పాల్ చెప్పారు. హనుమకొండలోని కాంగ్రెస్ భవన్ లో వరంగల్ పార్లమెంట్ ఇన్ చార్జి కత్తి వెంకటస్వామి, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డితో కలిసి శనివారం మీడియాతో మాట్లాడారు.
బీజేపీ, బీఆర్‍ఎస్ తోడు దొంగలని, ఆ పార్టీ లీడర్లు ఢిల్లీలో దోస్తీ చేస్తూనే గల్లీలో లొల్లి పెట్టుకుంటూ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్‍ఎస్ చేసిన పదేళ్ల అవినీతికి బీజేపీ అండగా ఉంటే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‍లో ప్రవేశపెట్టిన నల్ల చట్టాలు, బిల్లులకు కేసీఆర్ అండగా నిలిచారన్నారు. యూపీఏ హయంలో కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేస్తే.. బీజేపీ వచ్చాక తమిళనాడు తరలించారన్నారు. కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ దళిత ఎంపీని పక్కన కూర్చోబెట్టుకోలేని బీఆర్‍ఎస్ లీడర్లకు బుద్ధి చెప్పాలని పిలుపుననిచ్చారు. కార్పొరేటర్ తోట వెంకన్న, నేతలు పెరుమాండ్ల రామకృష్ణ, బంక సరళ సంపత్, జన్ను పరంజ్యోతి పాల్గొన్నారు.