ఎయిడెడ్​ విద్యాసంస్థలను కాపాడాలి

ఎయిడెడ్​ విద్యాసంస్థలను కాపాడాలి

చరిత్రను నిశితంగా పరిశీలిస్తే  బ్రిటీష్​ కాలంలో ప్రారంభమైన ఎయిడెడ్  విద్యా వ్యవస్థ  ఏళ్ల తరబడి  నాణ్యమైన  విద్యకు  కేరాఫ్​గా  నిలిచింది. ఆ విద్యా వ్యవస్థ నేడు  తెలంగాణ రాష్ట్రంలో  కనుమరుగుకు  కూతవేటు దూరంలో ఉన్నది. దశాబ్దాల తరబడి విద్యను భారంగా భావించిన ఎస్సీ, ఎస్టీ,  బీసీ,  మైనారిటీ  విద్యార్థులకు  విద్యాగంధాలను పంచి నేడు తమ ఉనికిని  కాపాడుకునే ప్రయత్నంలో చివరి అంచున పోరాడుతున్నాయి. పలు ట్రస్టులు, సొసైటీల కింద దాదాపుగా 67 ఎయిడెడ్  విద్యాసంస్థలు డిగ్రీ,  పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇంజినీరింగ్ కోర్సులను అందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి.. ఇందులో 58 కళాశాలలు ప్రైవేట్ భూముల్లో ఉన్నట్లు,  7 మాత్రమే ప్రభుత్వ భూముల్లో ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులు చెప్తున్నాయి.  ఇప్పటికే  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ విద్యాసంస్థలలో  2004లోనే ఆ నాటి ప్రభుత్వం భర్తీ ప్రక్రియను జీవో  నెంబర్ 35 ద్వారా  నిలిపివేయగా ఆ తర్వాత వచ్చిన  ప్రభుత్వాలు సైతం అదే తంతును  కొనసాగించాయి.  ఎయిడెడ్  విద్యాసంస్థలను  ఆర్థిక భారంగా  భావిస్తున్న  ప్రభుత్వాలు తమ సహాయాన్ని కూడా ఉపసంహరించుకోవడంతో పాటు పలు కళాశాలల్లో  ఎయిడెడ్ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులుగా అనుమతించడంతో  ఆయా విద్యాసంస్థల  భవితవ్యం గందరగోళంలో పడిపోయింది. 

ప్రభుత్వాల మొండిచేయి

వందేండ్లకు పైగా చరిత్ర గల చాలా పురాతన ఎయిడెడ్ విద్యాలయాలు.. నిరుపేద బిడ్డలకు ఉన్నత విద్యను అందించడంలో  ఘన చరిత్రను కలిగి ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన ఈ విద్యాకుసుమాలు నేడు విద్యార్థులు లేక  వెలవెలబోతున్నాయి.  ఒకప్పుడు  రెగ్యులర్  అధ్యాపకులతో  గొప్పగా వర్ధిల్లి... నేడు చాలీచాలని జీతాలతో కాలం వెళ్లదీస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల రోదనతో  తల్లడిల్లిపోతున్నాయి.  మొన్నటికి మొన్న  వరంగల్ లోని ఓ ఎయిడెడ్ కళాశాలలో  పార్ట్ టైం  అధ్యాపకుడు అరకొర జీతంతో  జీవితాన్ని నెట్టుకొస్తూ  ఆర్థిక సమస్యలతో ఆత్మార్పణం చేసుకున్నాడు.  ఉమ్మడి రాష్ట్రంలోనే  అధ్యాపకులు,  సిబ్బంది భర్తీని నిలిపేయడమే కాకుండా, అధ్యాపకులకు జీతాలు,  కళాశాలల  అభివృద్ధికి  నిధులను ఆపేయడం లాంటి  చర్యలతోనే  ఒక రకంగా  ఆనాడే  ఎయిడెడ్  విద్యాలయాలు వెనుకబడిపోయాయి.  సొంత తెలంగాణ రాష్ట్రంలో కూడా గత కేసీఆర్​ ప్రభుత్వంలో ఆశించిన స్థాయిలో బాగుపడలేదు.  

క్షీణించిన యాజమాన్యాల సహకారం 

ఒక గొప్ప ఉద్దేశ్యంతో ఆనాడు వెనుకబడిన వర్గాల విద్యార్థులకు విలువైన విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రాంతం నుంచి చాలా మంది మేధావులు ముందుకు వచ్చి ట్రస్టులను,  సొసైటీలను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా చాలా కళాశాలలను స్థాపించారు.  అందుకు గొప్ప తార్కాణమే ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్.  నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో 19వ శతాబ్దంలోనే రాష్ట్రవ్యాప్తంగా చాలా కళాశాలలను స్థాపించి విద్యా విప్లవానికి పునాదులు వేశారు.  ఓరుగల్లు నగరంలో చందా కాంతయ్య అనే విద్యావేత్త  గొప్ప ఉద్దేశ్యంతో  విద్యాసంస్థలను  ఏర్పాటు చేశారు . అలాగే ఎ.వి.వి  ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో పలు విద్యాలయాలను స్థాపించి యాజమాన్యం విద్యావ్యాప్తికి బాటలు వేసింది.  ఆనాడు మహోన్నత  ఆలోచనతో  ప్రభుత్వ సహకారంతో  గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల విద్యార్థుల విద్యాభివృద్ధికి పునాదులు వేసిన ఆనాటి మహానుభావులు  ఒక్కొక్కరుగా కనుమరుగు కావడంతో  వారి గొప్ప ఆలోచనలు సైతం కాలగర్భంలో కలిసిపోతున్నాయి. 

రేవంత్​ సర్కారుపై గురుతర బాధ్యత

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్​పై  విద్యావ్యవస్థకు పునర్ వైభవం తీసుకురావాల్సిన గురుతర బాధ్యత ఉంది.  వారి మేనిఫెస్టోలో  డిగ్రీ, ఇతర ఎయిడెడ్ కళాశాలలకు గత వైభవం తీసుకువస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలి.  ఎయిడెడ్ విద్యాసంస్థలను బలోపేతం చేయాలి.  విద్యాలయాలను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునికీకరించాల్సిన  ప్రభుత్వాలు వాటిని విస్మరించడం తగదు. జాతీయ విద్యా విధానం 2020 లాంటి నూతన విద్యా చట్టాలను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం తప్పకుండా అర్హత గల విద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించి ఎయిడెడ్ విద్యావ్యవస్థను కాపాడాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్ అధ్యాపకులను నియామకం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.  ఉన్నత విద్య కోసం లక్షల్లో ఫీజులు కట్టలేని పేద,  మధ్యతరగతి  కుటుంబాలు తమ పిల్లలను  ప్రముఖ ఎయిడెడ్ విద్యాలయాల్లో చదివిస్తూ తమ పిల్లలు గొప్ప చరిత్ర గల కళాశాలల్లో చదువుతున్న తీరును చూసి ఆనందపడేవారు. అట్లాంటివారు ప్రస్తుతం ఎయిడెడ్ కళాశాలలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్న పరిస్థితిని చూసి బాధపడుతున్నారు.  

ప్రభుత్వ కాలేజీల భూములపై వ్యాపారుల కన్ను

ప్రభుత్వ భూముల్లో నడిచే  కళాశాలలపై  ప్రైవేట్ వ్యాపారస్తుల కన్ను పడడంతో పలువురు సొసైటీ బాధ్యులు గుట్టు చప్పుడు కాకుండా ఆయా స్థలాలపై కన్నేశారు. ఉదాహరణకు వరంగల్ నడిబొడ్డున 1970లో  26 ఎకరాల సువిశాలమైన స్థలంలో నిర్మించిన లాల్ బహదూర్ కళాశాల ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ  కోర్సులతో ప్రారంభమై దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన పౌల్ట్రీ బ్యాచిలర్  డిగ్రీ కోర్సుతో  ముందుకు సాగుతున్నది. ఈ కళాశాల రాను రాను ప్రభుత్వ సహాయ నిరాకరణతో,  నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. రెగ్యులర్ సిబ్బంది పదవీ విరమణ కావడంతో దాదాపు అన్ని కోర్సులను యాజమాన్యం సెల్ఫ్ ఫైనాన్సింగ్ వారి వైపు మరల్చి,  నాన్ టీచింగ్ స్టాఫ్ ను సైతం ప్రభుత్వం ఇతర కళాశాలలకు బదిలీ చేయడంతో పాటు యాజమాన్యం సహకార లేమితో కళాశాల ప్రైవేటు వ్యక్తుల కబ్జాకు గురవుతున్నది. ఎంతోమందిని జాతీయ, రాష్ట్రస్థాయిలో ఉన్నత శిఖరాలకు చేర్చిన ఈ కళాశాల నేడు పూర్వ వైభవం ఏనాటికైనా తిరిగొస్తుందని ఎదురుచూస్తోంది.  1944లో ఏర్పాటైన ఏవీవీ విద్యాసంస్థ దేశానికి ఒక గొప్ప ఉప రాష్ట్రపతిని అందించింది.  హైదరాబాద్‌‌ లాంటి మహా నగరంలో నాణ్యమైన విద్యకు ప్రసిద్ధి చెందిన భద్రుకా కళాశాల,  ఏవీ కళాశాల, ఆంధ్ర మహిళా సభ కళాశాల వంటి కళాశాలలు నేడు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి. 

- పిన్నింటి విజయ్ కుమార్,
కాకతీయ యూనివర్సిటీ