ఎయిడెడ్ స్కూల్స్..మనుగడపై నీలినీడలు

  •     టీచర్ల నియామకాల నిలిపివేతతో ఉనికి ప్రశ్నార్థకం
  •     మూసివేత వైపు అడుగులు నాలుగైదు నెలలకోసారి టీచర్లకు వేతనాలు
  •     అమలుకు నోచుకోని సీఎం హామీ..
  •     ఉమ్మడి జిల్లాలో 26 స్కూళ్ల పరిస్థితి దయనీయం

నిర్మల్, వెలుగు :  ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్ల మనుగడ రోజురోజుకూ ప్రశ్నార్థకమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎయిడెడ్ స్కూల్స్ కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. 2003లో ఎయిడెడ్ స్కూళ్లలో కొత్త టీచర్లు, స్టాఫ్ నియామకాలు చేపట్ట రాదంటూ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆ స్కూళ్లలో నియామకాలు జరగడం లేదు. ఎయిడెడ్ స్కూల్స్ ను ఆదుకుంటామంటూ సీఎం కేసీఆర్ గతంలో పలుసార్లు ఇచ్చిన హామీ నెరవేరడంలేదు. దీంతో వాటి మనుగడకు ముప్పు ఏర్పడింది. 

స్టూడెంట్లు, టీచర్లకు ఇబ్బందులు

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 400కు పైగా ఎయిడెడ్ స్కూల్స్ ఉండగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 26 స్కూళ్లు ఉండగా వాటిల్లో 13 హైస్కూళ్లు, మరో 13 ప్రైమరీ స్కూళ్లు ఉన్నాయి. అయితే ప్రభుత్వం స్కూళ్ల విషయంలో శ్రద్ధ చూపకపోతుండడంతో వాటిల్లో చదివే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ టీచర్లతో సమానంగా ఈ బడుల్లో పనిచేస్తున్న టీచర్లు విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారికి సరైన న్యాయం దక్కడం లేదు. 101 పద్దు కింద కాకుండా నాన్ ప్లాన్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద వేతనాలు చెల్లిస్తుండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆ టీచర్లు వాపోతున్నారు.

కుబేర్ సిస్టం అమలవుతున్నప్పటి నుంచి నాలుగైదు నెలలకోసారి జీతాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఎయిడెడ్ స్కూళ్లలో ప్రతి ఏటా టీచర్లు రిటైర్ అవుతున్నప్పటికీ కొత్త నియామకాలు లేకపోవడంతో ఉన్న కొద్ది మందే అన్ని సబ్జెక్టులను బోధించాల్సి వస్తోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న ఎయిడెడ్ స్కూల్​లో 400 మందికి పైగా స్టూడెంట్లు ఉన్నప్పటికీ కేవలం ఏడుగురు  టీచర్లు మాత్రమే కొనసాగుతున్నారు.

Also Raed :- ఈఎస్ఐ ఆస్పత్రిలో .. బాలికపై అత్యాచారం

కొత్తగా టీచర్ల నియామకాలు జరగకపోతుండడంతో అడ్మిషన్లు కూడా ఆశించిన మేరకు రావడం లేదు. ప్రభుత్వం నిర్వహణ గ్రాంట్ విడుదల చేయకపోవడంతో ఎయిడెడ్ పాఠశాలలన్నీ మూసివేత వైపు అడుగులేస్తున్నాయి. 
 
టీచర్ల నియామకం, గ్రాంట్ మంజూరు కీలకం...

ఎయిడెడ్ స్కూళ్ల మనుగడను కాపాడేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ స్కూళ్లలో టీచర్లు, స్టాఫ్ నియామకాలను పునరుద్ధరించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు ఈ స్కూళ్ల నిర్వహణపై నిర్లక్ష్యం చేశారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతోందన్న విద్యావేత్తలు పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్ గతంలో ఈ స్కూళ్లను కాపాడుతామంటూ హామీ ఇచ్చారని ఆ భరోసా నిలుపుకోవాలంటున్నారు.

మెయింటెనెన్స్ గ్రాంట్ ను పునరుద్ధరించాలని కోరుతున్నారు. సబ్జెక్టుల వారీగా టీచర్ పోస్టులను మంజూరు చేయడమే కాకుండా నియామకాలను చేపట్టి వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని సూచిస్తున్నారు. ‘మన ఊరు మన బడి’ పథకం కింద ఈ పాఠశాలలను చేర్చి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

స్వరాష్ట్రంలోనూ మాపై  వివక్ష కొనసాగుతోంది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో మాపై వివక్ష కొనసాగింది. తెలంగాణ ఏర్పడగానే మా సమస్యలన్నీ పరిష్కారమవుతాయని సంబరపడ్డాం. కానీ సీఎం ఇచ్చిన హామీ నెరవేరడం లేదు. మాకు మూడు నెలలకోసారి జీతాలు అందుతున్నాయి. జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్​మెంట్ సౌకర్యం కూడా లేదు. కొత్త రిక్రూట్​మెంట్లు లేకపోవడంతో స్కూళ్లను మూసివేసే పరిస్థితి ఏర్పడుతోంది. ఎయిడెడ్ స్కూళ్లు, టీచర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.

- చొక్కా రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎయిడెడ్ టీచర్స్ గిల్డ్