T20 World Cup 2024: వారెవ్వా మార్కరం.. ఫీల్డింగ్ తోనే మ్యాచ్ గెలిపించాడుగా

T20 World Cup 2024: వారెవ్వా మార్కరం.. ఫీల్డింగ్ తోనే మ్యాచ్ గెలిపించాడుగా

క్రికెట్ లో బ్యాటింగ్, బౌలింగ్ తో మ్యాచ్ గెలిపించిన సందర్భాలు ఎన్నో చూశాం. అయితే కొన్నిసార్లు అద్భుత ఫీల్డింగ్ తో కూడా మ్యాజిక్ చేసి మ్యాచ్ టర్న్ చేయొచ్చని దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్కరం నిరూపించాడు. న్యూయార్క్ వేదికగా సోమవారం (జూన్ 10) బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచ్ లో సఫారీ కెప్టెన్ తన ఫీల్డింగ్ తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మొత్తం ఈ మ్యాచ్ లో నాలుగు క్యాచ్ లు అందుకోగా.. వాటిలో ఒకటి మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ కావడం విశేషం. 

బంగ్లాదేశ్ గెలవాలంటే చివరి 2 బంతుల్లో 6 పరుగులు చేయాలి. ఈ దశలో స్పిన్నర్ కేశవ్ రాజ్ ఫుల్ టాస్ బంతి విసరగా.. స్ట్రైకింగ్ లో ఉన్న మహ్మదుల్లా లాంగాన్ దిశగా భారీ షాట్ కొట్టాడు. అయితే ఇక్కడే అద్భుతం జరిగింది. బౌండరీ రోప్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మార్కరం చాలా దూరాన్ని కవర్ చేసి క్యాచ్ ను ఒడిసి పట్టాడు. అదే సమయంలో బౌండరీ రోప్ ను టచ్ చేయకుండా తనను తాను నియంత్రించుకున్న తీరు అత్యద్భుతం. ఈ క్యాచ్ తో ఒక్కసారిగా మ్యాచ్ దక్షిణాఫ్రికా వైపు మొగ్గింది. ఇదే ఓవర్ మూడో బంతికి జాకీర్ హుస్సేన్ క్యాచ్ అందుకున్న మార్కరం.. అంతకముందు మరో  రెండు క్యాచ్ లు అందుకున్నాడు. 

ఎంత గొప్ప ఫీల్డరైనా ఒత్తిడిలో కొన్నిసార్లు తడబడతారు. కానీ మార్కరం మాత్రం ఆ తప్పు చేయలేదు. దక్షిణాఫ్రికా విజయంలో క్లాసన్, మిల్లర్ తో పాటు బౌలర్లు ఉన్నప్పటికీ.. మార్కరం ఒత్తిడిలో పట్టిన ఒక్క క్యాచ్ ఆ జట్టుకు గెలుపును అందించింది. ప్రపంచంలో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడిగా పేరు గాంచిన మార్కరం.. గతంలో ఎన్నోసార్లు అసాధారణ ఫీల్డింగ్ తో ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ టోర్నీలో బ్యాటింగ్ లో దారుణంగా విఫలమవుతున్నా.. కెప్టెన్ గా, ఫీల్డర్ గా అదరగొడుతున్నాడు. క్యాచ్ లతో పాటు మెరుపు ఫీల్డింగ్ చేస్తూ టీ20 క్రికెట్ లో ఫీల్డింగ్ ఎంత ముఖ్యమనే విషయాన్ని మరోసారి రుజువు చేశాడు.