IND vs SA Final: కమ్మిన్స్ దారిలో మార్కరం.. పిచ్‌ను పరిశీలిస్తున్న సౌతాఫ్రికా కెప్టెన్

IND vs SA Final: కమ్మిన్స్ దారిలో మార్కరం.. పిచ్‌ను పరిశీలిస్తున్న సౌతాఫ్రికా కెప్టెన్

భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాపై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఆరో సారి విశ్వ విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ పక్కా ప్రణాళికతో భారత్ ను ఓడించాడు. మ్యాచ్ కు ముందు పిచ్ గురించి కమ్మిన్స్ వేసిన అంచనా నిజమైంది. దీంతో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకోవాలనే నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఫైనల్ కు ముందు పిచ్ మొత్తాన్ని ఫొటోలు తీయటం వైరల్ గా మారింది. ఇప్పటి వరకు ఎవరూ ఇలా చేయలేదు.. జస్ట్ వచ్చి చూస్తారు.. చేతులు, కాళ్లతో పరిశీలిస్తారు.. 

ఫస్ట్ టైం ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్.. పిచ్ మొత్తాన్ని తన ఫోన్ లో ఫొటోలు తీయటం ఆసక్తిగా మారింది. ఫొటోలు తీయటం అనేది నేరం కాదు.. అయినా అప్పట్లో ఆసక్తికర చర్చ నడిచింది. ప్రస్తుతం సౌతాఫ్రికా కెప్టెన్ ఏడెన్ మార్కరం కూడా కమ్మిన్స్ నే ఫాలో అవుతున్నాడు. టీమిండియాతో మరికొన్ని గంటల్లో బార్బడోస్ వేదికగా శనివారం (జూన్ 29) ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు సఫారీ కెప్టెన్ బార్బడోస్ లోని పిచ్ ను పరిశీలిస్తున్న ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అతని పక్కనే ఉన్న కోచ్ పిచ్ ను ఫోటోలు తీస్తూ కనిపిస్తున్నాడు. కమ్మిన్స్ దారిలో మార్కరం భారత్ కు మరోసారి ఝలక్ ఇస్తాడేమో చూడాలి.

ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా ఓటమెరుగని జట్టుగా ఫైనల్ కు దూసుకెళ్లింది. గ్రూప్ దశలో నాలుగు విజయాలతో టాప్ లో నిలిచింది. సూపర్ 8లో అదే జోరు కొనసాగించిన సఫారీలు టేబుల్ టాపర్ గా నిలిచారు. సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించి తొలిసారి ఫైనల్లోకి   అడుగుపెట్టారు. 1998 లో ఐసీసీ ఛాంపియన్స్ గెలిచిన దక్షిణాఫ్రికాకు మరో ఐసీసీ టైటిల్ గెలిచే అవకాశం వచ్చింది. ఫైనల్లో గెలిచి వరల్డ్ కప్ ట్రోఫీని తొలిసారి చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది.