IND vs SA Final: ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయగలం: ఫైనల్‌కు ముందు మార్కరం కాన్ఫిడెన్స్

IND vs SA Final: ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయగలం: ఫైనల్‌కు ముందు మార్కరం కాన్ఫిడెన్స్

వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు దక్షిణాఫ్రికా చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్ మార్కరం ఆ దేశ క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. 32 ఏళ్ళ దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి ఆ జట్టును ఫైనల్ కు చేర్చాడు. మార్కరం కెప్టెన్సీలో సౌతాఫ్రికా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అండర్ 19 వరల్డ్ కప్ లో ఆరు మ్యాచ్ లాడితే ఆరు విజయాలు.. 2023 వన్డే వరల్డ్ కప్ లో బావుమా గైర్హాజరీలో రెండు మ్యాచ్ ల్లో రెండు విజయాలు.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో ఆడిన 8 మ్యాచ్ ల్లోనూ విజయాలు.. ఓవరాల్ గా 16 మ్యాచ్ ల్లో 16 విజయాలతో 100 శాతం సక్సెస్ రేట్ కలిగి ఉన్నాడు. 

ఇప్పటివరకు సౌతాఫ్రికా వరల్డ్ కప్ చరిత్రలో మొత్తం 7 సార్లు సెమీ ఫైనల్ కు చేరుకుంది. వన్డే వరల్డ్ కప్ లో 1992, 1999,2007,2015 లలో సెమీస్ కు చేరుకుంది. తొలి ప్రయత్నంలో ఇంగ్లాండ్ పై అనూహ్యంగా ఓడిపోయిన ఆ జట్టు.. ఆ తర్వాత వరుసగా రెండు(1999,2007) సార్లు ఆసీస్ చేతిలో పరాజయం తప్పలేదు. 2015 లో న్యూజీలాండ్ పై చివరి వరకు పోరాడినా గెలుపు దక్కలేదు. భారత్ వేదికగా జరిగిన 2023 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లోనూ ఆస్ట్రేలియా నిరాశ తప్పలేదు. టీ20 వరల్డ్ కప్ విషయానికి వస్తే 2009లో తొలి సారి సెమీస్ కు చేరుకొని పాకిస్థాన్ పై 2014 లో భారత్ పై ఓడిపోయింది. 

చోకర్స్ అనే ముద్ర ఉన్న దక్షిణాఫ్రికా జట్టును మార్కరం ఫైనల్ కు చేర్చాడు. దీంతో ఆ దేశం మొత్తం మారకరం మ్యాజిక్ తో ఫైనల్ గెలుస్తుందని ఆశిస్తున్నారు. శనివారం (జూన్ 29) జరగనున్న ఫైనల్ ఫైట్ లో భారత్ తో ఫైనల్ ఫైట్ కు సిద్ధమైంది. బార్బడోస్ లోని కెన్నింగ్ టన్ ఓవల్ లో ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఈ మ్యాచ్ కు ముందు ఈ సఫారీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

"పెద్ద టోర్నీల్లో ఒత్తిడిని ఎదుర్కోలేమన్నారు. ఈ వరల్డ్ కప్ లో మా జట్టు ప్రతి మ్యాచ్ లో ఒత్తిడిని అధిగమించింది. ఓడిపోయే మ్యాచ్ ల్లోనూ గెలిచి చూపించాం. ఈ నమ్మకంతోనే మేము ఫైనల్లో బరిలోకి దిగుతాం. భారత జట్టు బలమైనదని తెలుసు. కానీ రెండు  సంవత్సరాలుగా మేము క్రికెట్ లో ఆటగాళ్లు చక్కని ఆటతీరును ప్రదర్శిస్తున్నారు. వరల్డ్ కప్ గెలవటానికి ఇది మాకు చక్కని అవకాశం". అని మార్కరం ఫైనల్ కు ముందు గెలుపుపై ధీమా వ్యక్తం చేశాడు. మరి మార్కరం చెప్పినట్టుగా మొదటసారి సౌతాఫ్రికా వరల్డ్ కప్ టైటిల్ అందుకుంటుందేమో చూడాలి.