- ఐద్వా నేషనల్ జనరల్ సెక్రటరీ ధావలె
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : దేశంలో రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలపై మహిళలు సమరశీల పోరాటాలు చేయాలని అఖిల భారత మహిళా సమాఖ్య(ఐద్వా)నేషనల్ జనరల్ సెక్రెటరీ మరియం ధావలె పిలుపునిచ్చారు. కొత్తగూడెం క్లబ్లో ఐద్వా రాష్ట్ర మహాసభల సందర్భంగా సీనియర్ నాయకురాలు బత్తుల హైమావతి జెండా, ఐద్వా లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ప్రజల ఆహార భద్రతకు పెను సవాలుగా మారిందన్నారు.
మహిళల అభ్యున్నతితోనే దేశాభివృద్ధి సాధ్యమనే విషయాన్ని పాలకులు విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రధాని అయ్యాకే మహిళలు తిరోగమని దిశలో పయనిస్తున్నారన్నారు. అసంఘటిత రంగాల్లోని కార్మికులకు కనీసం వేతనాలు అందడం లేదన్నారు. ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పీకే శ్రీమతి మాట్లాడుతూ మతోన్మాదానికి వ్యతిరేకంగా మహిళలంతా ఉద్యమించాలన్నారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, ఐద్వా, సీపీఎం నేతలు పుణ్యవతి, సుధా సుందర్రామన్, అరుణ జ్యోతి, పి.ప్రభావతి, గీతారాణి, మిడియం బాబూరావు, ప్రసాద్ పాల్గొన్నారు.