హామీల అమలులో కేంద్ర, రాష్ట్రాలు ఫెయిల్

 హామీల అమలులో  కేంద్ర, రాష్ట్రాలు ఫెయిల్
  • ఐద్వా స్టేట్​ జనరల్​సెక్రటరీ మల్లు లక్ష్మి
  • విద్యా, వైద్యంపై పాలకులు ప్రత్యేక దృష్టి పెట్టాలె
  • ప్రజా, మహిళా  సమస్యలపై నిరంతర పోరు 
  • ముగిసిన ఐద్వా రాష్ట్ర నాలుగో మహాసభలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర పాలకులు ఫెయిల్ అయ్యారని ఐద్వా స్టేట్​జనరల్​సెక్రటరీ మల్లు లక్ష్మి విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలను రాష్ట్రంలో అమలు చేయడంలో కాంగ్రెస్​సర్కార్​నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. 

 కొత్తగూడెంలో ఐద్వా నాలుగో రాష్ట్ర మహాసభలు  బుధవారం ముగిశాయి. మీడియా సమావేశంలో ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం దావలె, రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతితో కలిసి మహాసభల వివరాలను ఆమె వెల్లడించారు. మహిళలపై అత్యాచారాలు, హింసను నియంత్రించ డంలో పాలకులు ఫెయిల్​అయ్యారని మండిపడ్డారు.

ఆహార భద్రతా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.  చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్​అమలు చేయాలని ఆమె డిమాండ్​చేశారు. అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5లక్షలు, కేంద్రం రూ. 10 లక్షలు ఇవ్వాలని కోరారు. హాస్పిటల్స్​, హాస్టల్స్​లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. మైక్రో ఫైనాన్స్​సంస్థల వేధింపులతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు

దేశంలో, రాష్ట్రంలో మాతృ, శిశు మరణాలు పెరుగుతున్నాయన్నారు. మహిళల హక్కుల కోసం ఐద్వా నిరంతరం పోరాటాలు చేస్తోందన్నారు.  కార్యక్రమంలో ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పీకే శ్రీమతి, ట్రెజరర్ పుణ్యవతి, ఉపాధ్యక్షురాలు సుందర్​ రామన్​, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ, బి. హైమావతి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి. లక్ష్మి, ఎం. జ్యోతి పాల్గొన్నారు.