నల్గొండ అర్బన్, వెలుగు : లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తానని ఏఐఎఫ్బీ అసెంబ్లీ అభ్యర్థి పిల్లి రామరాజు యాదవ్అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో పిల్లి రామరాజుయాదవ్బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ప్రధాని మోదీ అని, మూడోసారి మోదీని పీఎం చేసుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములం అవుదామని పిలుపునిచ్చారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో నా వెంట నడిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గం ప్రజల కోసం నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు పనిచేస్తానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతమంది ఇబ్బంది పెట్టినా ప్రజలు నాకు మద్దతుగా నిలిచి 30 వేల ఓట్లు వేశారని గుర్తుచేశారు. బీజేపీ జిల్లా నాయకత్వంతో కలిసి పని చేస్తానని స్పష్టం చేశారు.
నా ప్రాణం ఉన్నంతవరకు ఆత్మగౌరవాన్ని ఎవరి దగ్గర తాకట్టు పెట్టననని, నల్గొండ నియోజకవర్గ ప్రజలకు, అభివృద్ధి కోసం మాత్రమే తలవంచి పనిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్నాగం వర్షిత్‌రెడ్డి, నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, బీజేపీ రాష్ర్ట కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, పోతెపాక సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.