- ఏండ్లుగా అయిజ మినీ ట్యాంక్ బండ్ పనులు పెండింగ్
- పూడుకుపోయిన తూములు, కాలువలు
- మట్టి తరలింపుతో చెరువు నిండా గుంతలు
- సాగు నీరందక పడావు పడ్డ పంట చేలు
గద్వాల/అయిజ, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ పనులు ఏండ్లుగా పెండింగ్ లో ఉండడం రైతులకు శాపంగా మారుతోంది. 560 ఎకరాల సారవంతమైన భూములు బీడుగా మారిపోయాయి. భారత్ మాల రోడ్డు పనులకు మట్టి తరలించేందుకు ఇష్టం వచ్చినట్లు తవ్వకాలు చేపట్టడంతో చెరువు నిండా గుంతలు పడ్డాయి. మట్టి తవ్వకాలు, పెండింగ్ పనులతో చెరువు తూములు మూసుకుపోయాయి. అయిజ పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచాలనే ఉద్దేశంతో పట్టణ సమీపంలోని బింగిదొడ్డి పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ గా మార్చేందుకు 2019లో రూ.4 కోట్లతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా పనులు కంప్లీట్ కాలేదు. అప్పటి నుంచి పొలాలకు నీళ్లు రాక ఆయకట్టు భూములు బీడుగా మారాయి.
2019 లో పనులు స్టార్ట్ చేసినా..
అయిజ మండలం కట్టకింద తిమ్మప్ప స్వామి ఆలయం పై భాగంలో ఉన్న బింగి దొడ్డి పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ గా మార్చాలని నిర్ణయించారు. ఈ చెరువు కింద 560 ఎకరాల ఆయకట్టు ఉంది. కట్ట వెడల్పులో భాగంగా చెరువుకు ఉన్న రెండు తూములు, పిల్ల కాలువలు పూడుకుపోయాయి. చెరువు కట్ట నిర్మాణంతో పాటు భారత్ మాల రోడ్డు పనులకు చెరువులోని మట్టిని తీసుకెళ్లడంతో పడిన గోతుల్లో నీళ్లు నిలిచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కాంట్రాక్టర్ పరార్..
మినీ ట్యాంక్ బండ్ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ చెరువులో ఉన్న మట్టిని కట్ట వెడల్పు పనులు చేసి రూ.1.10 కోట్లు బిల్లులు దండుకొని పనులు వదిలేసి వెళ్లిపోయాడు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించక పోవడంతో వేరే కాంట్రాక్టర్ కు పనులు అప్పగించారు. ఆయన కూడా పనులు చేయలేదు. మట్టి పనులు చేసి ఎక్కువ మొత్తం బిల్లులు తీసుకోవడం, చేయాల్సిన పనులు ఎక్కువగా ఉండడంతో పనులు చేయడానికి ముందుకు రావడం లేదని అంటున్నారు.
జాడలేని పర్యాటక హంగులు..
మినీ ట్యాంక్ బండ్ అని చెప్పుకుంటున్నా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కట్ట వెడల్పు చేయడం, కట్ట చుట్టూ రెయిలింగ్, సెంట్రల్ లైటింగ్, ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు, పరిసరాల్లో గార్డెనింగ్, సందర్శకుల కోసం క్యాంటీన్, బోటింగ్, కట్టపై కుర్చీలు, వాకింగ్ ట్రాక్, చెరువు తూము, అలుగు, కాలువలు రిపేర్లు చేయడం, సమీపంలో ఉన్న ఆలయాలు అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే బింగిదొడ్డి చెరువు కట్టపై అలాంటివేమి కనిపించడం లేదు.
వానాకాలంలో నీళ్లు ఇవ్వాలి
బింగిదొడ్డి పెద్ద చెరువు తూములు, కాలువలు పూడుకుపోవడంతో ఆయకట్టుకు సాగు నీరు అందడం లేదు. ప్రభుత్వం స్పందించి ముందుగా కాలువల రిపేర్లు చేసి ఆయకట్టుకు ఈఏడాది వానాకాలంలో సాగునీరు అందించాలి.
మేకల నాగిరెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు
నోటీసులు ఇస్తున్నాం..
పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మధ్యలో వెళ్లిపోయాడు. 60సి కింద వేరే కాంట్రాక్టర్ కు పనులు అప్పజెప్పాం. ఆయన కూడా ముందుకు రావడం లేదు. నోటీసులు ఇస్తున్నాం. మినీ ట్యాంక్ బండ్ పనులు కంప్లీట్ అయ్యేలా చూస్తాం.
విజయ్ కుమార్ రెడ్డి, ఈఈ, ఆర్డీఎస్