హైదరాబాద్, వెలుగు: ఐఖ్య ఇన్ఫ్రా డెవలపర్స్ ఐకేఎఫ్ ఫైనాన్స్ సహకారంతో హైదరాబాద్‌లో ఇరవై ఎకరాల విస్తీర్ణంలో లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్ట్ 'ఈ5 వరల్డ్'ను నిర్మించనున్నట్టు ప్రకటించింది. నగరంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఐకేఎఫ్ ఫైనాన్స్ వ్యవస్థాపకుడు, ఈ5వరల్డ్ ప్రమోటర్ వీజీకే ప్రసాద్ మాట్లాడుతూ రిసార్ట్ స్టైల్ లివింగ్‌లో సరికొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తున్నామని చెప్పారు.
మొదటి దశలో 1 నుంచి 5 ఎకరాలు, రెండో దశలో 2 నుంచి 10 ఎకరాలు, మూడో దశలో 3 నుంచి 5 ఎకరాలు అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో మూడు క్లబ్ హౌస్‌లు ఉంటాయి. వీటిలో యోగా గదులు, వెల్నెస్ జోన్లు, స్విమ్మింగ్ పూల్స్, వినోద సౌకర్యాలు, రెండు రెస్టారెంట్లు ఉంటాయి. పచ్చని ప్రదేశాలు, గ్రీన్ గార్డెన్స్, నీటి వనరులు, నడక మార్గాలను నిర్మిస్తారు. పిల్లల కోసం ప్రత్యేక అడ్వెంచర్ ప్రదేశాలు, పెద్దలు, వృద్ధుల కోసం నేచర్ ట్రైల్స్, వెల్నెస్ లాంజ్‌లను కడతారు. ప్రాక్షనల్ ఓనర్షిప్ ద్వారా దీనిని అందరికి చేరువ చేయనున్నామని, రూ.10 లక్షలలోపు మొత్తంతో రిసార్ట్‌లో భాగస్వామ్యం పొందవచ్చని ప్రసాద్ చెప్పారు.