జగిత్యాల జిల్లాలో టీఆర్ఎస్ సర్పంచ్ పై అవినీతి ఆరోపణలు

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ టీఆర్ఎస్ గ్రామ సర్పంచ్ పిడుగు రాధ.. గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సర్పంచ్ రాధపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో డీపీఓ నరేష్, డీఎల్పీఓ శంకర్, ఎంపీడీవో నీరజ ఐలాపూర్ గ్రామంలో విచారణ చేపట్టారు. సర్పంచ్ రాధపై ఫిర్యాదు చేసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చారు. సర్పంచ్ పదవిని అడ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ కొందరు గ్రామస్తులు అధికారులకు  ఫిర్యాదు చేశారు. 

సర్పంచ్ పిడుగు రాధ.. ఆమె భర్త సదయ్య, ఇతర కుటుంబ సభ్యులు, మరికొంతమంది బినామీల పేర్లతో గ్రామ పంచాయితీ నిధులను గోల్ మాల్ చేసినట్లు ఆరోపించారు. దాదాపు రూ.కోటి 9 లక్షల వరకూ నిధులు దుర్వినియోగం చేశారని ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం అధికారులు జిల్లా కలెక్టర్ కు నివేదిక అందించనున్నారు. గ్రామ పంచాయతీ నిధులను ఐలాపూర్ సర్పంచ్ రాధ దుర్వినియోగం చేశారని తేలితే ఆమెపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.