టెలికం రంగంలోని అన్ని కంపెనీల మధ్య న్యాయబద్ధమైన పోటీ ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందని, గుత్తాధిపత్యాన్ని అనుమతించబోమని కేంద్ర టెలికంశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. సేవల్లో నాణ్యతను మరింత పెంచాలని, 5జీ టెక్నాలజీని అందించడానికి కృషి చేయాలని స్పష్టం చేశారు. ఢిల్లీలో శనివారం మంత్రి టెల్కోల సీఈఓలతో భేటీ అయిన సందర్భంగా ఈ సూచనలు చేశారు. టెల్కోలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సుంకాల తగ్గింపు, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్లు ఇవ్వడం, జీఎస్టీ తగ్గింపు, యూనివర్సల్ సర్వీస్ ఓబ్లిగేషన్ తగ్గింపు వంటి ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు.
ఇండియా ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడంలో టెలికంరంగం కీలకపాత్ర పోషిస్తుందని ప్రసాద్ అన్నారు. ఐదు ట్రిలియన్ డాలర్లలో టెలికంవాటా 25 శాతం వాటా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రసాద్ టెలికం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత సీఈఓలతో భేటీ కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం టెలికం రంగం తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. అన్ని కంపెనీల అప్పు రూ.ఏడు లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ప్రసాద్‌తో జరిగిన సమావేశానికి ఎయిర్‌టెల్ సీఈఓ గోపాల్ విటల్, వొడాఫోన్ ఐడియా సీఈఓ బాలేశ్ శర్మ, జియో బోర్డు మెంబర్ మహేంద్ర నహతా, బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్ పీకే పుర్వర్ హాజరయ్యారు.