ఆధార్లో 3.80 కోట్లు..కులగణనలో 3.70 కోట్లా ? : అక్బరుద్దీన్ ​ఒవైసీ

ఆధార్లో 3.80 కోట్లు..కులగణనలో 3.70 కోట్లా ? : అక్బరుద్దీన్ ​ఒవైసీ
  • రాష్ట్ర జనాభా లెక్కల్లో ఏది కరెక్ట్: అక్బరుద్దీన్​ ఒవైసీ
  • ఏఐ టూల్స్​వాడి డేటాను అసెస్​ చేయొచ్చు కదా
  • సర్వేలో కేవలం ముస్లిం మైనారిటీలనే చేర్చారు
  • క్రిస్టియన్లు, పార్శీలు, సిక్కులు, జైనులు ఏం పాపం చేశారు ?
  • కులగణన సర్వే సమగ్ర రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టాలని ఒవైసీ డిమాండ్
  • ఓటర్​ కార్డు వంటి వివరాలను ప్రామాణికంగా తీసుకోలేమన్న సీఎం
  • కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల వివరాలు డబుల్ ఉన్నాయని వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: ఆధార్, ఓటర్​కార్డు, రేషన్​కార్డు, సమగ్ర కుటుంబ సర్వే వివరాలతో పోలిస్తే కులగణన వివరాల్లో తేడా ఉందని, ఏ డేటా కరెక్ట్​ అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఒవైసీ ప్రశ్నించారు. ‘‘2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3.5 కోట్లు. ఆధార్​ కార్డు డేటా ప్రకారం 3.80 కోట్లు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఓటర్లు  3.35 కోట్లు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 3.66 కోట్ల మంది జనాభా ఉన్నట్టు తేలింది. కులగణన సర్వేలో మొత్తం జనాభా 3.70 కోట్లుగా తేల్చారు. మరి, వీటిలో ఏ లెక్క కరెక్ట్” అని అడిగారు.

మంగళవారం కులగణన సర్వేపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏ డేటాకూ పొంతనలేదని విమర్శించారు. ఆధార్​ డేటాతో పోలిస్తే జనాభా ఎందుకు తక్కువగా ఉంటుందని ప్రశ్నించారు. ఈ సందర్భంలో సీఎం రేవంత్​రెడ్డి కల్పించుకొని..  ఓటర్​ కార్డు వివరాలను ప్రామాణికంగా తీసుకోలేమని చెప్పారు. కొన్ని చోట్ల ఓటర్ల సంఖ్య డబుల్​ ఉందని తెలిపారు. ఉదాహరణకు నాంపల్లి నియోజకవర్గంలో 59 వేల మంది ఓటర్ల వివరాలు డబుల్​ ఉన్నాయని ఎన్నికల సంఘం లెక్కల్లో తేలిందని చెప్పారు. చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందని సీఎం రేవంత్​ అన్నారు.

శేరిలింగంపల్లి, కూకట్​పల్లి, ఎల్బీనగర్​ వంటి నియోజకవర్గాల్లో ఎప్పుడూ సగం ఓటింగే నమోదవుతుందని, అక్కడ చాలా మందికి ఓటు హక్కు లేదని, సొంతూర్లలో ఓటు హక్కు ఉంటుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల్లో 82 ఉపకులాలున్నాయని గత ప్రభుత్వం సర్వేలో పేర్కొందని, కానీ, తమ సర్వేలో కేవలం 50 కులాలే ఉన్నట్టు తేలిందని స్పష్టం చేశారు. తాము బాధ్యతగా పనిచేస్తున్నామని, ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సలహాలిస్తూ కులగణన సర్వేకు మద్దతివ్వాలని ఆయన కోరారు. అయితే, రేషన్​ కార్డుల డేటాలోనూ పొంతనలేదని అక్బరుద్దీన్​ అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 90 లక్షల కార్డులున్నాయని, కొత్తగా మరో 42 లక్షల మంది అప్లై చేసుకున్నారని అన్నారు. ఈ లెక్కన రేషన్​ కార్డుల సంఖ్య 1.30 కోట్లకుపైగా ఉంటుందని తెలిపారు. అంటే ఒక్క రేషన్​ కార్డును ఒక్క కుటుంబంగా తీసుకున్నా.. ఒక్కో కుటుంబంలో ముగ్గురు చొప్పున 3.9 కోట్ల మందికిపైగా జనాభా ఉంటుంది కదా అని అక్బరుద్దీన్​ ప్రశ్నించారు. 

ఏఐ టూల్స్​తో డేటాను సరిచేయొచ్చు కదా
రాష్ట్రాన్ని ఏఐ హబ్గా మారుస్తామంటున్నారని, మరి డేటా తప్పుగా ఉంటే ఏఐ టూల్స్​ను ఉపయోగించి కులగణన సర్వే వివరాలను సరిపోల్చవచ్చు కదా అని అక్బరుద్దీన్​ ఒవైసీ అన్నారు. సర్వేలో భాగంగా ఎన్ని ఇండ్లు కవర్​ చేశారన్న విషయాలను రేషన్​ కార్డులు, ఆధార్​ డేటా ఆధారంగా పోలిస్తే తప్పులు ఏవైనా ఉం టే తేలుతుందని చెప్పారు. సర్వేలో కేవలం ముస్లిం మైనారిటీలనే పేర్కొన్నారని.. క్రిస్టియన్లు, పార్శీలు, సిక్కులు, జైనులు ఏం పాపం చేశారని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ట్రిపుల్​ టెస్ట్​ను బీసీ డెడికేటెడ్​ కమిషన్​ ఫాలో అయిందా? అని అడిగారు. 

రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే కాంగ్రెస్​ సర్కారు 50 శాతాన్ని దాటేసిందని, అలాంటప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన సగం లిమిట్​పై ఎందుకు ఆలోచన చేయడమని అన్నారు. కులగణన సర్వే రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఒవైసీ డిమాండ్​ చేశారు. ఆ రిపోర్టును ఇస్తే జిల్లాలవారీగా వివరాలు తెలుస్తాయని, సమగ్రమైన చర్చ పెట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు.

కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​రావు వివరాలొస్తేనే రిపోర్టును పెట్టాలన్న ఆలోచనలో సర్కారుందా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 72 శాతం రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్​ చేశారు. కులగణన సర్వేకు 14 నెలల టైం తీసుకున్నారని, ఆరు నెలల్లో చేస్తామని ఆలస్యం చేశారని ఆయన విమర్శించారు. తీరా ఇప్పుడు రిపోర్టు ఇవ్వకుండా సర్వేలో తేలిన అంశాలపైనే చర్చ పెట్టడమేంటన్నారు. 

కామారెడ్డి బీసీ డిక్లరేషన్​, మైనారిటీ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లలో పేర్కొన్న ప్రకారం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్​ చేశారు. నాంపల్లి నియోజకవర్గం విషయంలో ఓటర్ల లిస్టును సరిచేయాల్సిందేనని అక్బరుద్దీన్​ అన్నారు. ఓల్డ్​ సిటీలో ఫేక్​ ఆధార్తో చాలా మంది బంగ్లాదేశీలు ఉంటున్నారని ఆరోపిస్తున్నారని, అలాంటి వారిని గుర్తించాల్సిన అవసరమూ ఉందని చెప్పారు. 

మైనారిటీలకు రిజర్వేషన్లు పెంచాలి
దేశంలో మైనారిటీలకు రిజర్వేషన్లు తక్కువగా ఉన్నాయని, వారికీ పెంచాలని అక్బరుద్దీన్​ డిమాండ్​ చేశారు. దేశాన్ని ప్రపంచానికి సూపర్​ పవర్​గా మార్చాలంటే ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోవాలన్నారు. మైనారిటీలు, మతాలు అన్న తేడా లేకుండా ప్రతి భారతీయుడికీ సమాన అవ కాశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ముస్లింలు చాలా వెనుకబడి ఉన్నారనే విషయాన్ని సచార్​ కమిషన్​ రిపోర్టులో చెప్పిందని తెలిపారు. ఆర్థి కంగా వెనుకబడిన వారిన ఈబీసీ రిజర్వేషన్లు ఇస్తున్నారని, మైనారిటీల్లో వెనుకబడిన వారిని అందులో కలపాలన్నారు. ఆ రిజర్వే షన్లను 10 నుంచి 25 శాతానికి పెంచాల్సిన అవసరం ఉం దన్నారు. మైనారిటీలనూ ఇండి యన్లుగా చూస్తే దేశం బాగుపడుతుందని వ్యాఖ్యానించారు.