
- హైదరాబాద్లో 19న బహిరంగ సభ: అసదుద్దీన్ ఒవైసీ
- చట్టం ఎంత హాని చేస్తుందో ప్రజలకు వివరిస్తామని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: వక్ఫ్ చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధమని, దీనికి వ్యతిరేకంగా 19వ తేదీన బహిరంగ సభ నిర్వహిస్తామని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని దారుస్సలాంలో జరిగే ఈ సభలో.. వక్ఫ్ ఆస్తులకు కొత్త చట్టం ఎంత హానికరమో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. సభకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రహమానీ అధ్యక్షత వహిస్తారన్నారు. అలాగే, దేశవ్యాప్తంగా మతపెద్దలు, పలువురు రాజకీయ నేతల హాజరవుతారని తెలిపారు. మజ్లిస్ పార్టీ ఆఫీస్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ వ్యతిరేకం. బీజేపీ తమ భావజాలాన్ని దేశంపై రుద్దుతున్నది.
చట్టాన్ని సవరించి హక్కులన్నీ లాగేసుకున్నది. వక్ఫ్ చట్ట సవరణ అనేది.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25, 26, 29ను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నది. బీజేపీ.. తమ ఎన్డీయే మిత్రపక్షాల సహకారంతోనే వక్ఫ్ చట్ట సవరణ తీసుకొచ్చింది. ఈ చట్టంపై మోదీ మరోసారి ఆలోచించాలి. వక్ఫ్ చట్ట సవరణపై బెంగాల్లో జరుగుతున్న నిరసనలు శాంతియుతంగా ఉండాలి. హింసను మేము ఖండిస్తున్నాం’’అని ఒవైసీ అన్నారు. బహిరంగ సభకు వక్ఫ్ కమిటీలోని ఎంపీలను కూడా ఆహ్వానిస్తామని తెలిపారు. జమాత్ ఎ ఇస్లామీ, జమియత్ ఉలమ -ఎ -హింద్‌తో పాటు ఇతర సంస్థల లీడర్లు సభలో ప్రసంగిస్తారని వివరించారు.