
న్యూఢిల్లీ: వివాదస్పద వక్ఫ్ బిల్లుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. వక్ఫ్ సవరణ బిల్లులోని అంశాలను ఇస్లామిక్ విలువలు, షరియా, మత, సాంస్కృతిక స్వేచ్ఛ, మత సామరస్యం, భారత రాజ్యాంగ పునాది నిర్మాణంపై తీవ్రమైన దాడిగా ఏఐఎంపీఎల్బీ అభివర్ణించింది. ఇందుకు నిరసనగా దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు స్పష్టం చేసింది. బీజేపీ మతపరమైన ఎజెండాకు కొన్ని రాజకీయ పార్టీలు అందించిన మద్దతు వాళ్ల లౌకిక ముఖచిత్రాన్ని పూర్తిగా బహిర్గతం చేసిందని పేర్కొంది.
అన్ని మత, సామాజిక సంస్థల సమన్వయంతో ఈ సవరణలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని.. ఈ బిల్లును పూర్తిగా రద్దు చేసే వరకు ఆందోళనలు కొనసాగుతాయని ఏఐఎంపీఎల్బీ తేల్చి చెప్పింది. వచ్చే వారం నుండి దేశవ్యాప్తంగా నిరసనలు మొదలు పెడతామని.. జిల్లా స్థాయిలో ఆందోళనలు నిర్వహించి ఆ తర్వాత దేశ హోంమంత్రికి, భారత రాష్ట్రపతికి మెమోరాండం సమర్పిస్తామని తెలిపింది.
►ALSO READ | అసెంబ్లీ ఎన్నికల్లో RJD గెలిస్తే.. చెత్తబుట్టలో వక్ఫ్ సవరణ బిల్లు: తేజస్వి యాదవ్
ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో ఈ నిరసనలు ప్రారంభిస్తామని.. మొదటి దశ ఆందోళనలు బక్రీద్ వరకు కొనసాగుతాయని తెలిపింది. ఈ నిరసనలలో యువత చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చింది. నిరసనలు శాంతియుతంగా చేయాలని సూచించింది. ‘సేవ్ వక్ఫ్, సేవ్ ది కాన్స్టిట్యూషన్’ పేరుతో ఈ ఆందోళనలు చేపడతామని పేర్కొంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, మలప్పురం, పాట్నా, రాంచీ, మలేర్‌కోట్ల, లక్నో వంటి నగరాల్లో ప్రధాన నిరసనలు జరుగుతాయని వెల్లడించింది.
వక్ఫ్ సవరణల బిల్లుతో భారతదేశంలోని ముస్లిం సమాజాం నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. ఈ విషయంలో నాయకత్వం ఎటువంటి త్యాగాలకు వెనుకాడదని భరోసా ఇచ్చింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు జనరల్ సెక్రటరీ మౌలానా ముహమ్మద్ ఫజ్లూర్ రహీం ముజాద్దిది మాట్లాడుతూ.. ఈ బిల్లును వ్యతిరేకించడానికి ఉన్న అన్ని మార్గాలను ఎంచుకుంటామని తెలిపారు. ఈ వివక్షత, అన్యాయమైన సవరణలను సుప్రీంకోర్టులో బోర్డు సవాల్ చేస్తోందని పేర్కొన్నారు. అలాగే.. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు.