- ఏర్పాట్లపై ముందస్తు దృష్టి పెట్టని లీడర్లు, ఆఫీసర్లు
- భక్తులకు తప్పని ఇబ్బందులు
- నేడు ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరపై రివ్యూ
హనుమకొండ/ వర్ధన్నపేట, వెలుగు: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవోలు మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఏటా సంక్రాంతి సమయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనుండగా, ఆ మూడు రోజుల్లోనే దాదాపు 10 లక్షల మంది వరకు భక్తులు తరలివస్తుంటారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే ఈ జాతరలో చాలావరకు పెండింగ్ పనులు వెక్కిరిస్తున్నాయి. ఇప్పటికే దేవాలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై వివాదం నడుస్తుండగా, ఏర్పాట్లపై లీడర్లు, ఆఫీసర్లు మీనమేషాలు లెక్కిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ముందస్తు ఏర్పాట్లపై దృష్టి పెట్టని పాలకులు, జాతర సమయంలోనే హడావిడి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కాగా, మంగళవారం జాతర ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించనుండగా, భక్తుల ఇబ్బందులు, పెండింగ్ పనులపై దృష్టి పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ట్రస్ట్ బోర్డుపై వివాదం..
మల్లన్న ఆలయ ట్రస్టు బోర్డు నియామకంపై రెండు జాతరల నుంచి వివాదం నడుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో నిబంధనలు పాటించకుండా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తగా, హనుమకొండకు చెందిన ఓ వ్యక్తి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి వివాదం కొనసాగుతోంది. కాగా, వర్ధన్నపేట మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధిని మల్లన్న ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్గా ప్రకటించేందుకు రంగం సిద్ధమైనప్పటికీ ఐనవోలు మండలానికి చెందిన నాయకులు వ్యతిరేకించడం వల్లే ఆ నిర్ణయం వాయిదా పడినట్లు తెలిసింది. రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్ల మల్లన్న ట్రస్ట్ బోర్డు నియామకం వివాదాల్లోకి ఎక్కుతోందనే చర్చ నడుస్తోంది.
పెండింగ్ పనులతో ఇబ్బంది..
ఐనవోలు ఆలయ అభివృద్ధి, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతిపాదించిన పనులు చాలావరకు మాటలకే పరిమితమయ్యాయి. భక్తుల రద్దీ దృష్ట్యా రూ.కోటితో నాలుగు సులభ్ కాంప్లెక్సులు నిర్మించేందుకు గతంలో కసరత్తు చేశారు. ఇంతవరకు ఒకటి మాత్రమే పూర్తయ్యింది. దీంతో భక్తులు టెంపరరీ వసతులపై ఆధార పడాల్సి వస్తోంది. దాదాపు రూ.2.5 కోట్లతో డార్మెటరీ హాల్ నిర్మాణం చేపట్టినా, నిధుల కొరతతో పనులు పునాది లెవల్ లోనే ఉండిపోయాయి.
ఒగ్గు పూజారుల భవనం, కల్యాణ కట్ట నిర్మాణానికి రూ.90 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. కుడా ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదన చేశారు. దాంతోపాటు మల్లన్న సదన్ ముందు రోడ్డుతోపాటు ఆలయ ఆవరణతో పాటు చుట్టూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించేందుకు ప్రపోజల్స్ రెడీ చేశారు. ఆ పనులన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. వర్ధన్నపేట మండలం ఇల్లంద నుంచి కక్కిరాలపల్లి మీదుగా ఐనవోలుకు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. ఈ రోడ్డు నుంచే వర్ధన్నపేట, రాయపర్తి మండలాల ప్రజలు మల్లన్న దర్శనానికి వెళ్తారు. గతంలోనే ఈ రోడ్డు రిపేర్లు చేస్తామని లీడర్లు హామీ ఇచ్చినా, ఇంతవరకు పనులు చేపట్టకపోవడంతో ఈసారీ ఇబ్బందులు తప్పేలా లేవు. జాతర సమయంలో ధరల నియంత్రణపై ఫోకస్ పెట్టకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు.
నేడు జాతరపై రివ్యూ..
జనవరి 13 నుంచి మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా, ఇప్పటికే ఆలయంలో పనులన్నీ పూర్తి కావాల్సి ఉంది. కానీ కొన్ని పనులు పెండింగ్ లో ఉండటం, ఇంకొన్ని ప్రతిపాదనలకు అడుగులు పడకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మల్లన్న జాతరపై ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ ప్రావీణ్య, ఇతర నేతలు, ఆఫీసర్లతో రివ్యూ చేయనున్నారు. పెండింగ్ పనులతోపాటు అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలపై లీడర్లు, ఆఫీసర్లు ఫోకస్ పెట్టాలని భక్తులు కోరుతున్నారు.