
గాంధీ నగర్: గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. జామ్‌నగర్‌లోని సువర్ద సమీపంలో బుధవారం (ఏప్రిల్ 2) రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన జాగ్వార్ యుద్ధ విమానం కుప్పకూలింది. పొలాల్లో క్రాష్ కావడంతో విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానం రెండు ముక్కలుగా విరిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి ఒక పైలెట్ సురక్షితంగా బయటపడగా.. మరో పైలెట్ తప్పిపోయాడు.
ALSO READ | పార్లమెంటులో వక్ఫ్ బిల్లుపై చర్చ..యూపీలో భద్రత పెంపు..పోలీసులకు సెలవులు రద్దు
స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో ఎయిర్ ఫోర్స్ అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. అదృశ్యమైన మరో పైలెట్ కోసం గాలింపు మొదలుపెట్టారు. యుద్ధ విమానం కుప్పకూలిపోవడానికి గల కారణం ఏంటన్న ప్రస్తుతానికి తెలియరాలేదు.
విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్నీ వివరాలు తెలయాల్సి ఉంది. ఈ ఘటనపై జామ్ నగర్ ఎస్పీ ప్రేమ్‌సుఖ్ దేలు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జామ్‌నగర్‌లో భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం కూలిపోయింది. ఒక పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి’’ అని తెలిపారు.
కాగా, గత నెల (మార్చి)లో కూడా హర్యానాలోని పంచకుల సమీపంలో జాగ్వార్ ఫైటర్ జెట్ కుప్పకూలిన విషయం తెలిసిందే. విమానంలో సాంతికేతిక సమస్య తలెత్తడంతో పైలట్ విమానాన్ని జనవాస ప్రాంతాల నుంచి దూరంగా తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. కుప్పకూలిన విమానం అంబాలా ఎయిర్‌బేస్ నుంచి శిక్షణాలో భాగంగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగి నెల రోజులు కూడా కాకముందే.. మరో జాగ్వార్ యుద్ధ విమానం క్రాష్ కావడం ఎయిర్ ఫోర్స్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వరుస యుద్ధ విమాన ప్రమాదాలపై అధికారులు సీరియస్‌గా దర్యాప్తు చేపట్టారు.