
దేశ రక్షణలో వెన్నెముక వంటి వాయు సేనలో చేరాలని కోరుకునే యువతకు ఇదో అద్భుత అవకాశం. డిగ్రీ పూర్తిచేసిన, బీటెక్ కంప్లీట్ అయిన వారి కోసం ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(ఏఎఫ్ క్యాట్) నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో గ్రూప్–ఏ గెజిటెడ్ ఆఫీసర్స్ ఇన్ ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్) అని రెండు విభాగాల్లో పోస్టులున్నాయి. అడ్మిషన్ టెస్ట్ ఎలా ఉంటుంది? సిలబస్, సెలెక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం..
ఏఎఫ్ క్యాట్ నోటిఫికేషన్ ఏడాదికి రెండుసార్లు విడుదలవుతుంది. ఫ్లయింగ్ విభాగంలో షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ), గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్) బ్రాంచీలో పర్మినెంట్ కమిషన్ (పీసీ), షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) కొలువులకు దరఖాస్తు చేసుకోవాలి. వీటితో పాటు ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ ఉంది. ఏఎఫ్ క్యాట్‌లోని మొత్తం కొలువుల్లో 10శాతం ఎన్‌సీసీ కింద కేటాయిస్తారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే.. ఎయిర్‌ఫోర్స్‌లో.. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో గెజిటెడ్ ఆఫీసర్ కొలువు సొంతమవుతుంది. నెలకు రూ.లక్షకు పైగా వేతనం అందుకునే అవకాశం లభిస్తుంది.
అర్హతలు: ఫ్లయింగ్ బ్రాంచ్: ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్‌లో 60 శాతం మార్కులతో పాటు 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ పాస్ అవ్వాలి.ఏరోనాటికల్ ఇంజనీర్(ఎలక్ట్రానిక్స్): నిర్దేశిత బ్రాంచ్‌లతో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సాధించాలి.
ఏరోనాటిక్ ఇంజనీర్(మెకానికల్): ఏరోస్పేస్, ఏరోనాటికల్, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్, మెకానికల్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమేషన్, ప్రొడక్షన్, మెకట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్, ఏరోస్పేస్ అండ్ అప్లయిడ్ మెకానిక్స్, ఆటోమోటివ్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, రబ్బర్ టెక్నాలజీ అండ్ రబ్బర్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లతో బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి.
గ్రౌండ్ డ్యూటీ-వెపన్ సిస్టమ్స్: ఎంపీసీ గ్రూప్‌లో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు 60 % మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
గ్రౌండ్ డ్యూటీ-అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్: 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
గ్రౌండ్ డ్యూటీ-అకౌంట్స్: 60 శాతం మార్కులతో బీకాం లేదా బీబీఏ/బీబీఎం/ బీబీఎస్(ఫైనాన్స్ స్పెషలైజేషన్) లేదా సీఏ/సీఎంఏ/సీఎస్/సీఎఫ్‌ఏ ఉత్తీర్ణత ఉండాలి.
గ్రౌండ్ డ్యూటీ ఎడ్యుకేషన్ బ్రాంచ్: 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
గ్రౌండ్ డ్యూటీ మెటీయరాలజీ బ్రాంచ్: 60 శాతం మార్కులతో బీఎస్సీ(ఫిజిక్స్, మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణత లేదా నిర్దేశిత బ్రాంచ్‌లతో బీఈ/బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్(ఫ్లయింగ్ బ్యాచ్): ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్ సీనియర్ డివిజన్ 'సి' సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు అందుబాటులో ఉన్న అవకాశం ఇది. వీరికి ఎన్‌సీసీ సర్టిఫికెట్‌తోపాటు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ తప్పనిసరి. ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్‌ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ: ఏఫ్‌క్యాట్‌లో భాగంగానే ఫ్లయింగ్ బ్రాంచ్‌లో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కూడా ఉంది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్‌లో పేర్కొన్న ఖాళీలు, అదే విధంగా ఏఎఫ్‌క్యాట్‌లో పేర్కొన్న సీట్లకు పది శాతం చొప్పున ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్‌కు కేటాయిస్తారు. ఈ విధానంలో దరఖాస్తు చేసుకోవాలంటే.. ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ విభాగంలో 'సి' సర్టిఫికెట్ పొంది ఉండాలి.
ఏఎఫ్‌ఎస్‌బీ సెలెక్షన్: ఎంపిక ప్రక్రియలో భాగంగా ముందుగా ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇందులో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించిన వారికి మలిదశలో ఎయిర్‌ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ పరిధిలో మరో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
విభాగాలు 4.. మార్కులు 300: ఎంపిక ప్రక్రియలో తొలి దశ ఏఎఫ్‌క్యాట్ 100 ప్రశ్నలు- 300 మార్కులకు జరుగుతుంది. మొత్తం 4 విభాగాలు.. జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ వెర్బల్ ఎబిలిటీ,న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, మిలటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కింగ్ నిబంధన కూడా ఉంది. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. పరీక్షకు నిర్దేశించిన సమయం రెండు గంటలు.
ఏఎఫ్‌ఎసీబీ టెస్టింగ్: తొలి దశ ఏఎఫ్‌క్యాట్‌లో విజయం సాధించిన వారికి రెండో దశలో ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్‌ల ఆధ్వర్యంలో ఏఎఫ్‌ఎస్‌బీ టెస్టింగ్ నిర్వహిస్తారు. ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం మూడంచెల్లో ఉంటుంది.
స్టేజ్-1: ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ టెస్ట్.
స్టేజ్-2: సైకాలజికల్ టెస్ట్. ఇందులో భాగంగా అయిదు రోజులపాటు పలు అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
ఎయిర్‌ఫోర్స్‌కు ఎంపికైన వారికి.. షార్ట్ సర్వీస్ కమి షన్ విధానంలో పదేళ్ల పాటు విధులు నిర్వర్తించే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత ఆసక్తి, ప్రతిభను అనుసరించి మరో నాలుగేళ్లపాటు పొడిగించుకునే వీలుంది. షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో మొత్తం 14 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత పర్మనెంట్ కమి షన్ హోదా పొందే అవకాశాన్ని కూడా ఎయిర్‌ఫోర్స్ కల్పిస్తోంది.
సిలబస్
ఇంగ్లీష్: కాంప్రషెన్షన్, ఇంగ్లీష్ గ్రామర్, సెంటెన్స్ కంప్లీషన్, సెంటెన్స్ ఫార్మేషన్, స్పాటింగ్ ద ఎర్రర్, యాంటానిమ్స్, సినానిమ్స్, క్లోజ్ టెస్ట్, ఇడియమ్స్, ఫ్రేజెస్, అనాలజీ, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్‌లపై దృష్టి పెట్టాలి.
జనరల్ అవేర్‌నెస్: చరిత్ర, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీలతోపాటు జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం సంతరించుకున్న అంశాలు, సంఘటనలు, సైన్స్ అండ్ టెక్నాలజీ తాజా పరిణామాలు, రక్షణ రంగంలోని పరిణామాలపై దృష్టి సారించాలి.
న్యూమరికల్ ఎబిలిటీ: టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్, సింపుల్, కాంపౌండ్ ఇంట్రస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, నంబర్ సిరీస్, పెరిమీటర్, ఏరియా, ప్రాబబిలిటీ అంశాలపై అవగాహన పొందాలి.
రీజనింగ్ అండ్ మిలటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్: ఇందులో రాణించడానికి వెర్బల్, నాన్ -వెర్బల్ రీజనింగ్ అంశాలతోపాటు.. సీటింగ్ అరేంజ్‌మెంట్, రొటేటెడ్ బ్లాక్స్, హిడెన్ ఫిగర్స్, అనాలజీపై అవగాహన పొందాలి.
నోటిఫికేషన్
పోస్టులు: 1) ఏఎఫ్‌క్యాట్ ఎంట్రీ: ఫ్లయింగ్/ గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)/ గ్రౌండ్ డ్యూటీ (నాన్- టెక్నికల్)
2) ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ: ఫ్లయింగ్
అర్హతలు: ఇంటర్(ఫిజిక్స్, మ్యాథ్స్), సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: ఫ్లయింగ్ బ్రాంచ్‌కు 20- నుంచి 24 ఏళ్లు. గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్/ నాన్-టెక్నికల్) బ్రాంచ్‌కు 20 నుంచి- 26 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.afcat.cdac.in వెబ్సైట్లో సంప్రదించాలి.
ఫ్లయింగ్ బ్రాంచ్ అభ్యర్థులకు ప్రత్యేకంగా కంప్యూటరైజ్డ్ పైలట్ సెలెక్షన్ సిస్టమ్ (సీపీఎస్‌ఎస్) విధానంలో ఇంకో పరీక్ష కూడా నిర్వహిస్తారు. ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ 'సి' సర్టిఫికెట్ ద్వారా ఎన్‌సీసీ ఎంట్రీకి దరఖాస్తు చేసుకున్న వారికి ఏఎఫ్‌క్యాట్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఏఎఫ్‌క్యాట్‌తోపాటు ఏఎఫ్‌ఎస్ బీ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించినవారిని శిక్షణకు ఎంపిక చేస్తారు.
ట్రైనింగ్: తుది విజేతలుగా నిలిచిన వారికి ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (హైదరాబాద్)లో శిక్షణనిస్తారు. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ-టెక్నికల్ విభాగాలకు ఎంపికైన వారికి 74 వారాలు, గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్) బ్రాంచ్‌లకు 52 వారాల పాటు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి.. సంబంధిత విభాగాల్లో ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా కొలువు ఖరారు అవుతుంది. వీరికి ప్రారంభంలో రూ.56,100 - రూ.1,77,500 వేతన శ్రేణి లభిస్తుంది. శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టయిఫండ్ ఇస్తారు.