
పంజాగుట్ట, వెలుగు: సిటీలో ఎయిర్‌హోస్టెస్ కు చేదు అనుభవం ఎదురైంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కేరళకు చెందిన యువతి ఎయిర్ ఇండియాలో ఎయిర్‌హోస్టెస్. ఈనెల 23న సిటీకి వచ్చి, అమీర్‌పేట్ గ్రీన్పార్క్హోటల్లో బస చేసింది. 25న రాత్రి 11 గంటలకు హాటల్‌కు చెందిన తులిప్ రెస్టారెంట్లో డిన్నర్ చేసి, హోటల్‌కు చేరుకుంది. అదే రెస్టారెంట్లో డిన్నర్ చేసిన ఓ వ్యక్తి ఆమె వెనకాలే హోటల్వద్దకు వెళ్లాడు. ఆమె రూమ్ డోర్ బెల్ మోగించాడు. ఏదో అలికిడి కావడంతో వెళ్లిపోయాడు. బాధితురాలు సెక్యూరిటీ మేనేజర్ వినోద్ కు చెప్పడంతో ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ పరిశీలించి, నిందితుడిని ఉప్పల్ కు చెందిన రాజశేఖర్‌గా గుర్తించి కేసు నమోదు చేశారు.