
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పైలట్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా చనిపోయిన ఘటన బుధవారం సాయంత్రం (ఏప్రిల్ 9, 2025) జరిగింది. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి ప్రయాణికులతో వచ్చిన విమానాన్ని సదరు పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశాడు. విమానం ల్యాండ్ అయిన కొద్దిసేపటికే పైలట్ అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ పైలట్ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా సదరు పైలట్ చనిపోయాడని తెలిపారు.
చనిపోయిన ఆ ఎయిర్ ఇండియా పైలట్ వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని ఎయిర్ లైన్స్ తెలిపింది. ఎయిర్ ఇండియా కూడా పైలట్ చనిపోయినట్లు ధ్రువీకరించింది. ప్రైవసీ కారణాల దృష్ట్యా ఆ పైలట్ పేరు, వివరాలను, అసలు ఏం జరిగిందనే విషయాలను వివరంగా వెల్లడించలేమని ఎయిర్ ఇండియా పేర్కొంది. అతని కుటుంబానికి అండగా నిలుస్తామని, అనవసర పుకార్లను ప్రచారం చేయొద్దని మీడియాకు సదరు ఎయిర్ లైన్స్ విజ్ఞప్తి చేసింది.
ఢిల్లీలో విమానం ల్యాండ్ అయిన వెంటనే సదరు పైలట్ విమానంలోనే వాంతులు చేసుకున్నాడని, ఒత్తిడికి లోనైనట్టుగా కనిపించారని ఆ విమానంలోని ఎయిర్ లైన్స్ సిబ్బంది చెప్పారు. వృత్తిపరమైన ఒత్తిడి వల్లే ఇలా జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైలట్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ఇండియాలో ఎక్కువ మంది పైలట్లు.. డే, నైట్ అని తేడా లేకుండా 24 గంటల్లో 13 గంటలు డ్యూటీ చేయాల్సి వస్తుందని.. ఈ కారణంగా నిద్రలేమి, మానసిక ఒత్తిడికి గురవుతున్నారని విమానయాన సిబ్బంది వాపోతున్నారు. గతంలోనూ పలు సందర్భాల్లో పైలట్లు గుండెపోటుతో చనిపోయిన ఘటనలు వెలుగుచూశాయి.