ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ఎయిర్ లైన్స్ లో పనిచేస్తున్న 25మంది ఉద్యోగులపై వేటు వేసింది యాజమాన్యం. పనిలో తిరిగి జాయిన్ కాకపోవడంతో వారిని ఉద్యోగాల్లో నుంచి తీసివేసింది. ఉద్యోగులు మూకుమ్మడిగా సెలవులు పెట్టడంతో ఫ్లైట్లు క్యాన్సిల్ కావడంతో.. వందలాది మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో వారిపై చర్యలు తీసుకుంది ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ మేనేజ్మెంట్.
మే 8న దేశవ్యాప్తంగా ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ కు చెందిన పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. సోమవారం రాత్రి నుంచి దాదాపు 70కిపైగా విమాన సేవలు నిలిచిపోయాయి. సిబ్బంది సిక్ లీవ్ లు పెట్టడంతోనే ఈ సమస్య తలెత్తింది. సంస్థలో కొన్ని విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ దాదాపు 3వందల మంది మూకుమ్మడి సెలవులు పెట్టారు. విమాన సర్వీసుల రద్దు కావడంతో పలువురు ప్రయాణీకులు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ క్షమాపణలు చెప్పింది. ఏడు రోజుల్లోగా ప్రయాణాన్నీ రీషెడ్యూల్ చేసుకోవచ్చని సూచించింది. ఇక ఇప్పుడు గడువులోగా విధుల్లో చేరని 25మంది ఉద్యోగులను టెర్మినేట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఎయిర్ లైన్స్ మేనేజ్మెంట్.