ఎయిర్ ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్ నష్టం 163 కోట్లు

ఎయిర్ ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్ నష్టం 163 కోట్లు

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌‌‌‌‌‌‌‌ ఎయిర్​లైన్​ ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్ 2023-–24 (2024 ఆర్థిక సంవత్సరం)లో రూ. 163 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గత సంవత్సరం దీనికి రూ. 117 కోట్ల లాభం వచ్చింది. గత తొమ్మిదేళ్లలో విమానయాన సంస్థ నష్టాల్లో కూరుకుపోవడం ఇది రెండోసారి. కంపెనీ మొత్తం ఆదాయం ఏడాది ప్రాతిపదికన 33 శాతం పెరిగి 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.7,600 కోట్లకు చేరుకుంది.  ఇదే కాలంలో దాని మొత్తం వ్యయం 38.3 శాతం పెరిగి రూ. 7,763 కోట్లకు చేరుకుంది. 

భారీ విస్తరణ, ప్రత్యేకించి దేశీయ మార్కెట్లో, వివిధ మార్గాల్లో మార్కెట్ లీడర్ ఇండిగోతో పోటీ నష్టాలకు ప్రధాన కారణం. ఎయిర్ ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్ ఇండిగో మాదిరిగానే చార్జీలను తగ్గించింది. ఎయిర్‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్,  కొత్త ఉద్యోగుల నియామకం మొత్తం ఖర్చులను పెంచాయి. జనవరి 2022లో టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌లను స్వాధీనం చేసుకునే ముందు ఎయిర్ ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్​కు చెందిన  90 శాతానికి పైగా విమానాలు అంతర్జాతీయ మార్గాల్లో ఉన్నాయి.  ఎయిర్ ఇండియాకు చెందిన మరో లోకాస్ట్ విమానయాన సంస్థ ఏఐఎక్స్​కనెక్ట్​కు 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.1,149 కోట్ల నష్టం వచ్చింది.