ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఎయిర్ ఇండియా పైలట్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ముంబైలోని అంథేరి ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్లో సృష్టి తులి అనే 25 ఏళ్ల యువతి విగత జీవిగా కనిపించింది. అంథేరిలోని ఆమె ఫ్లాట్లో యువతి విగత జీవిగా కనిపించింది. ఈ కేసులో ఆమె బాయ్ ఫ్రెండ్ ఆదిత్య పండిట్(27)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ 29 వరకూ పోలీస్ కస్టడీలో ఉంచి అతనిని విచారించనున్నారు.
యువతితో పలుమార్లు ఆమె బాయ్ ఫ్రెండ్ గొడవపడి ఆమె గురించి అసహ్యంగా, అభ్యంతరకరంగా మాట్లాడటం వల్లే సృష్టి తులి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె అంకుల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమె కుటుంబ సభ్యులు మరో కొత్త విషయాన్ని బయటపెట్టారు. ఆమె ప్రియుడే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని యువతి కుటుంబం ఆరోపించింది. అంతేకాదు.. నాన్ వెజ్ ఫుడ్ తినడం మానేయాలని పబ్లిక్గా ఆమెను తిట్టాడని యువతి కుటుంబం చెప్పింది. యువతి స్వస్థలం యూపీలోని గోరక్పూర్. ఉత్తరప్రదేశ్లోని గోరక్ పూర్ నుంచి తొలి మహిళా పైలట్ సృష్టి తులినే కావడం గమనార్హం.
ఢిల్లీలో కమర్షియల్ పైలట్ లైసెన్స్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో రెండేళ్ల క్రితం సృష్టికి, ఆదిత్య పండిట్కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొన్నాళ్లకు స్నేహంగా మారింది. ఇద్దరి మధ్య స్నేహం కుదరడంతో పాటు మనసులు కూడా కలవడంతో ప్రేమించుకున్నారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. అంథేరి ఈస్ట్లోని మరోల్ కనకియ రైన్ ఫారెస్ట్ బీ వింగ్లో రూమ్ నెం.601లో సృష్టి తులి ఉంటోంది. ఆమె ఒక కమర్షియల్ పైలట్. యూపీకి చెందిన ఈ యువతి ఉద్యోగం నిమిత్తం 2023 జూన్ నుంచి ముంబైలోనే ఉంటోంది. నవంబర్ 25న అర్ధరాత్రి సమయంలో ఆమె డేటా కేబుల్తో ఉరేసుకుని తన ఫ్లాట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటన జరగక ముందు ఐదారు రోజుల క్రితం ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా ఆమె ఫ్లాట్లోనే ఉన్నాడు.
నవంబర్ 25 అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఢిల్లీకి కారులో బయల్దేరాడు. ఆమె బాయ్ ఫ్రెండ్ డ్రైవింగ్లో ఉండగా సృష్టి అతనికి కాల్ చేసింది. ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నట్లు అతనితో చెప్పింది. వెంటనే భయంతో వణికిపోయిన ఆమె బాయ్ ఫ్రెండ్ ముంబైకి తిరుగు పయనమయ్యాడు. తన స్నేహితుడు ఊర్వి పాంచల్కు కాల్ చేశాడు. ఈ ఇద్దరూ సృష్టి ఫ్లాట్కు వెళ్లేసరికి డోర్ లాక్ చేసి ఉంది. తాళాలు తీసే వ్యక్తిని తీసుకొచ్చి డోర్ లాక్ తీయించి చూసేసరికి సృష్టి ఉరేసుకుని కనిపించింది. ఆమెను హుటాహుటిన అంథేరి ఈస్ట్లోని సెవెన్ హిల్స్ హాస్పిటల్కు తరలించారు. అయితే ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు.
ఆమె బాయ్ ఫ్రెండ్ పండిట్ వల్లే ఆమె చనిపోయిందని, పండిల్ సోదరి ఎంగేజ్మెంట్కు వర్క్ ఉండటం వల్ల సృష్టి వెళ్లలేదని, అప్పటి నుంచి ఆమెకు నరకం చూపించాడని సృష్టి అంకుల్ చెప్పారు. సృష్టి ఒక ఫంక్షన్లో నాన్వెజ్ తిన్నదని అందరి ముందు ఆమెను తిట్టి అవమానించాడని.. ఇలా కొన్నాళ్ల నుంచి వేధింపులకు గురిచేశాడని ఆమె అంకుల్ ఆవేదన వ్యక్తం చేశారు. సృష్టి కుటుంబం ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు సెక్షన్ 108 కింద సృష్టి తులి బాయ్ ఫ్రెండ్, ఢిల్లీకి చెందిన ఆదిత్య పండిట్పై కేసు నమోదు చేశారు.