- గడిచిన వారం రోజుల్లో సగటున 102 ఏక్యూఐ నమోదు
- గత నెలలో సగటున 130 వరకు ఏక్యూఐ నమోదు
- సంక్రాంతికి జనం ఊరెళ్లడం, వాహనాలు రద్దీ లేకపోవడం, చలి తీవ్రత తగ్గడమే కారణం
హైదరాబాద్ సిటీ, వెలుగు: గత రెండు నెలలతో పోలిస్తే సిటీలో గాలి కాలుష్యం తగ్గింది. డిసెంబర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సగటున130 వరకు నమోదై మోడరేట్లెవెల్కు వెళ్లగా.. ఈ నెలలో గత వారం రోజుల్లో సగటున102 ఏక్యూఐ నమోదై ‘సంతృప్తికర’ స్థాయికి వచ్చింది. కొన్ని నెలలుగా నగరంలోని పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరుగుతూ వస్తున్నది. గత నెలలోనూ పొల్యూషన్ అత్యధికంగా నమోదైంది. అయితే అనూహ్యంగా కొన్నిరోజులుగా నగరంలో పలు ప్రాంతాల్లో ఏక్యూఐ లెవెల్స్ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. సిటీలోని 13 ప్రాంతాల్లో ఎయిర్‌క్వాలిటీ కొలిచే మీటర్ల నుంచి రీడింగ్ సేకరించగా ఈ విషయం వెల్లడైంది.
తగ్గడానికి కారణాలివే..
సంక్రాంతి పండుగ సందర్భంగా సిటీ జనం సొంతూళ్లకు తరలివెళ్లారు. జనవరి 11 నుంచి జనవరి 16 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. దీంతో నగరవాసులు పల్లె, పట్టణాల బాట పట్టారు. సిటీ దాదాపు ఖాళీ అయ్యింది. రోడ్లన్నీ నిర్మానుషమయ్యాయి. వాహనాల రద్దీ సగానికి పైగా తగ్గింది. ఊరెళ్లిన వారందరూ 16 తర్వాతే స్టార్ట్ అయి నిన్న మొన్నటి వరకు వస్తూనే ఉన్నారు. సిటీలో ఎయిర్ పొల్యూషన్ తగ్గడంతోపాటు ఉష్ణోగ్రతలు కూడా పెరిగి చలి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. గాలుల వేగం పెరగడంతో కాలుష్యం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాప్తి చెందడం లేదు.
ఆ నాలుగు ప్రాంతాల్లో అలాగే...
సనత్‌నగర్, పాశమైలారం, జూపార్కు, ఇక్రిశాట్లాంటి ఏరియాల్లో ఎప్పుడూ వాయు కాలుష్యం మోడరేట్ లెవెల్స్‌లో నమోదవుతూ ఉంటుంది. అయితే గత నెలతో పోలిస్తే ఈసారి అదే ఏక్యూఐ నమోదైంది. ఈ నాలుగు ఏరియాల్లో డిసెంబర్16 నుంచి 22 వ తేదీ వరకు137 ఏక్యూఐ రికార్డు కాగా, ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 140 ఏక్యూఐ నమోదైంది.
జూపార్కు దగ్గర ఫ్లై ఓవర్ పనులు, రోడ్డు వెడల్పు పనులు జరుగుతుండడం, ఆ చుట్టుపక్కల పరిసరాల్లో బ్యాటరీల్లో లెడ్బయటకు తీయడం కోసం కాల్చే ప్రక్రియలో పొల్యూషన్ పెరుగుతోందని పీసీబీ అధికారులంటున్నారు. పాశమైలారం, సనత్‌నగర్, ఇక్రిశాట్ దగ్గర పరిశ్రమలు ఉండడంతో ఏక్యూఐ పడిపోతోందంటున్నారు. ఈ నాలుగు చోట్ల కాకుండా మిగతా 9 ప్రాంతాల్లో గాలి నాణ్యత సగటున 60 నుంచి 100 ఏక్యూఐ నమోదైందని, ఇది శుభపరిణామం అని అంటున్నారు.
గత వారం రోజులుగా 13 స్టేషన్లలో నమోదైన సగటు ఏక్యూఐ వివరాలు
తేది సగటు ఏక్యూఐ
జనవరి 16 65
జనవరి 17 107
జనవరి 18 107
జనవరి 19 118
జనవరి 20 110
జనవరి 21 107
జనవరి 22 100
డిసెంబర్ నెలలో ఇలా..
డిసెంబర్ 16 125
డిసెంబర్ 17 121
డిసెంబర్ 18 120
డిసెంబర్ 19 121
డిసెంబర్ 20 91
డిసెంబర్ 21 106
డిసెంబర్ 22 107