దేశ రాజధాని ఢిల్లీ మరోసారి దేశవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో.. మానవ స్వయంకృత, వాతావరణ సంక్షోభ విష వలయంలో ఢిల్లీ చిక్కుకుంటోంది. ప్రజలు ఊపిరి తీయడం కూడా ప్రాణాంతకంగా మారుతున్నది. గాలి నాణ్యత ప్రమాణాలు క్షీణించి మహానగరవాసుల ఉసురు తీస్తున్నాయి. స్వల్ప, దీర్ఘకాలిక పరిష్కారాలు దొరక్క ఢిల్లీవాసులు ప్రమాదకర పరిస్థితులతోనే బతుకుతున్నారు. ఇటీవల ఢిల్లీ ప్రజలు కాలుష్య విషనాగు బుసలను ప్రత్యక్షంగా చూశారు. తాజాగా ఢిల్లీలో దుమ్ము, ధూళి, పొగ కలిసిపోయి గాలి కాలుష్య ప్రమాణాలైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఏక్యూఐ (గాలి నాణ్యత సూచీ) 300 దాటింది.
ఏక్యూఐ అత్యంత ప్రమాదకర 500 స్థాయి వరకు చేరడం ఢిల్లీవాసులు గమనించారు. ఇది అత్యంత ప్రమాదకరమని మహానగర పౌరులకు తెలుసు. అదృష్టంకొద్దీ గాలులు వేగంగా వీచడంతో ఆ ప్రమాదకర పొగమంచు నగరాన్ని వదిలి వెళ్లిపోయింది. ఢిల్లీ మహానగర జనాభా దాదాపు 2 కోట్లు, పరిసర ప్రాంతాల ప్రజలు మరో కోటి మంది ఉంటారు. వీరంతా కాలుష్య కోరల్లో చిక్కి రోగాల బారిన పడుతున్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి సారించకపోతే.. దేశ రాజధానిలో నివసించే ప్రజలు తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి జీవనయానం చేయవలసిందే. పాఠశాల, కాలేజీల విద్యార్థులు, యువత కూడా వాయు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నారు.
ఢిల్లీ కాలుష్యానికి ఎన్నో కారణాలు
కర్ణుడి చావుకు కారణాలనేకం. అదేవిధంగా ఢిల్లీ గాలి కాలుష్యానికి కూడా బోలెడు కారణాలు ఉన్నాయి. మానవ ప్రమేయ పారిశ్రామిక కాలుష్యం, ఇంధన వాహన కాలుష్యం, వ్యర్థాలను మండించడం, అధ్వానంగా మారిన రోడ్ల దుస్థితులతో దుమ్ము రేగడం, పండుగదినాల్లో టపాసుల్ని కాల్చడం లాంటివి ఢిల్లీ వాయు కాలుష్యాగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. అక్టోబర్, నవంబర్ మాసాల్లో రైతులు తమ వ్యవసాయ పంట వ్యర్థాలను విచక్షణారహితంగా కాల్చేయడం కూడా గాలి కాలుష్యం పెరగడానికి కారణం అవుతున్నది. రైతులకు మరో మార్గం దొరక్క, సమయం తక్కువగా ఉండడం, సులభంగా వ్యర్థాలను తొలగించడం, ఆర్థికంగా బలహీనత, అవగాహన లోపించడంతో కాలుష్యానికి తమవంతు కారణమవుతున్నారు.
ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలను చూపకపోవడంతోనే పంట వ్యర్థాలను అగ్నికి ఆహుతి చేస్తున్నట్లు అర్థం అవుతున్నది. అధిక సాగునీరు అవసరమైన పంటల్ని అధిక మొత్తంలో పండించడం కూడా పలు విధాలుగా పర్యావరణ విచ్ఛిన్నానికి దారి తీస్తున్నాయి. శీతాకాలం ప్రవేశించడంతో మంచు కురవడం, పొగ కమ్మడంతో ప్రమాదకర కాంతి రసాయన పొగమంచుగా మారుతోంది. ఆ కలుషిత గాలిని పీల్చడంతో అనారోగ్యం ప్రజలను వెంటాడుతోంది. దట్టమైన మంచు కమ్మడంతో కళ్లు మండడం, వాహనాలు కనిపించక ప్రమాదాలు జరగడం లాంటి విపరీత పరిస్థితులు ఢిల్లీవాసులకు ఎదురవుతున్నాయి.
ALSO READ : అలవి కాని హామీలు పెరిగిన అవినీతి
దుమ్ము, ధూళి రేగడం వాతావరణ కాలుష్య సమస్యను మరింత జటిలం చేస్తున్నది. ఈ విపరీత పరిస్థితులను అంచనా వేస్తూ ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలను సత్వరం తీసుకోవలసిన అవసరం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలుష్య కారణ ప్రరిశ్రమలను కట్టడి చేయాలి. వాహనాల కండిషన్లను పర్యవేక్షించడం, వాహన రద్దీని శాస్త్రీయంగా నియంత్రించడంతోపాటు వ్యవసాయ వ్యర్థాల తొలగింపునకు తగిన పరిష్కారాలు ప్రభుత్వాలు చూపాలి. గాలి కాలుష్యాన్ని నిరోధించే ఫిల్టర్లను ఏర్పాటు చేయడం లాంటి చర్యలు చేపట్టాలి. ఈ దిశగా పాలకులతోపాటు పౌర సమాజం మేల్కొనాలి.
- మధుపాళీ