డేంజర్​ బెల్స్ మోగినయ్..! వరంగల్‌ ప్రజలు పీల్చే గాలి ఇంత దారుణంగా ఉందా..?

డేంజర్​ బెల్స్ మోగినయ్..! వరంగల్‌ ప్రజలు పీల్చే గాలి ఇంత దారుణంగా ఉందా..?
  • హనుమకొండలో 100 దాటుతున్న పీఎం10 లెవల్స్
  • డంప్ యార్డు ఎఫెక్ట్ తో మడికొండ చుట్టుపక్కలా ప్రమాదకర స్థితి
  • ఇండస్ట్రీలు, వాహన ఉద్గారాలు, పొగ కారణమంటున్న ఆఫీసర్లు
  • బీ అలెర్ట్​ అంటున్న పర్యావరణ వేత్తలు

హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో ఎయిర్​ క్వాలిటీ పడిపోతోంది. ఇండస్ట్రీలు సరైన ప్రమాణాలు పాటించకపోవడం, పెట్రోల్, డీజిల్​ వెహికల్స్​ నుంచి వెలువడే కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. సమ్మర్​ సీజన్​ స్టార్ట్​ అయ్యిందంటే కన్ స్ట్రక్షన్​ వ్యర్థాలు, చెత్తను ఎక్కడికక్కడ తగులబెడుతుండటం వల్ల కూడా గాలి నాణ్యత దెబ్బతింటోంది. ఫలితంగా ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్​(ఏక్యూఐ)లో పీఎం10, పీఎం2.5 లెవెల్స్​పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా డంపింగ్ యార్డు ఎఫెక్ట్​ఉన్న మడికొండ, రాంపూర్​చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎయిర్​ క్వాలిటీ దెబ్బతినగా, వాయు కాలుష్యంతో అక్కడి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. 

గాడితప్పుతున్న గాలి నాణ్యత.. 

వరంగల్ నగరం రాష్ట్ర రెండో రాజధానిగా డెవలప్​ అవుతుండటంతో ఇండస్ట్రీస్ ఏర్పడుతున్నాయి. ఆఫీసులు, విద్య, ఉద్యోగ, ఉపాధి పనులు, ఇతర అవసరాల కోసం సిటీకి వచ్చే వెహికల్స్​ లక్షల్లోనే ఉంటున్నాయి. వాటి నుంచి వెలువడే సల్ఫర్​ డైఆక్సైడ్, నైట్రోజన్​ ఆక్సైడ్స్, అమ్మోనియా, తదితర కాలుష్య కారకాలతో ఎయిర్​ క్వాలిటీ దెబ్బతింటోంది. సిటీలో ప్రతి నెలా ఎయిర్​ క్వాలిటీని టెస్టు చేసేందుకు వరంగల్ మీసేవ, హనుమకొండలోని కుడా ఆఫీస్, బాలసముద్రంలోని పొల్యూషన్ కంట్రోల్​ బోర్డు ఆఫీస్, నక్కలగుట్ట ఈసేవ కేంద్రాల వద్ద శాంప్లింగ్ టెస్ట్​ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ప్రతి నెలా పీసీబీ ఆధ్వర్యంలో వాటిని మానిటర్ చేస్తుండగా, సమ్మర్​ సీజన్​ వచ్చిందంటే పార్టిక్యులేట్​ మేటర్ (పీఎం) లెవల్స్​ మారిపోతున్నాయి. 

సాధారణంగా పీఎం10 లెవెల్స్​ 60 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉండాల్సినప్పటికీ వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే నక్కలగుట్ట శాంప్లింగ్​ స్టేషన్​లో పీఎం10 లెవల్స్​ 100 దాటుతున్నాయి. పీఎం10 లెవెల్స్​ వంద దాటితే ఊపిరితిత్తులతోపాటు హార్ట్​ డిసీజెస్​ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మిగతా చోట్లా పీఎం10 లెవల్స్​ 60 నుంచి 100 లోపే ఉండగా, పెద్దగా సమస్యలు ఉండవని ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు.

మడికొండలో డేంజర్​ బెల్స్..

సిటీ వ్యాప్తంగా సీజన్ ను బట్టి పీఎం10, పీఎం2.5 లెవెల్స్​లో హెచ్చుతగ్గులు ఉంటుండగా, డంప్​యార్డు ప్రభావిత గ్రామాల్లో వాటి లెవెల్స్​చాలా ఎక్కువగా ఉంటున్నాయి. డంప్​యార్డు నుంచి వచ్చే పొగ, దుమ్ము, ధూళి కారణంగా మడికొండ, రాంపూర్​ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎయిర్​ క్వాలిటీ చాలా పూర్ గా ఉంటోంది. ఇటీవల డంప్​యార్డును తరలించాలని స్థానికులు ఆందోళనకు దిగగా, జీడబ్ల్యూఎంసీకి చెందిన ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్​ చేశారు. 

ఈ క్రమంలో అక్కడి ఎయిర్​ క్వాలిటీని చెక్​ చేయగా, పీఎం2.5 లెవెల్స్​ సగటున 243 మైక్రోగ్రామ్స్​చూపించింది. సెంట్రల్​పొల్యూషన్ కంట్రోల్​బోర్డు నార్మ్స్​ ప్రకారం పీఎం2.5 లెవెల్స్​ఏడాదికి సగటున 40 మైక్రోగ్రామ్స్​పర్ క్యూబిక్​మీటర్​ ఉండాలి. మడికొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో 200దాటి చూపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అక్కడి ప్రజల్లో చాలావరకు శ్వాసకోశ సమస్యలు కనిపిస్తున్నాయి. కొంతమంది ఇప్పటికే ఆస్తమా బారిన కూడా పడ్డారు. ఈనేపథ్యంలోనే అక్కడి ప్రజలు డంపింగ్​ యార్డును తరలించాలని నెల రోజులుగా ఉద్యమం కొనసాగిస్తున్నారు.

కంట్రోల్​ చేయకపోతే ముప్పే..

వాహనాలు, ఇండస్ట్రీలు, కన్​స్ట్రక్షన్స్​ తదితర కారణాల వల్ల కాలుష్యం పెరిగిపోతుండటం కలవరానికి గురి చేస్తుండగా, మున్ముందు సమస్య ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉంది. కాలుష్య నియంత్రణకు చర్యలు నామమాత్రంగా కూడా కనిపించడం లేదు. ఎక్కడికక్కడ చెట్లను నరికివేస్తుండగా, రోజురోజుకు పెట్రోల్, డీజిల్​ వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా తొందర్లోనే హైదరాబాద్​ తర్వాత వరంగల్ కూడా కాలుష్య నగరాల జాబితాలో చేరే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాలుష్య నియంత్రణకు ప్రతిఒక్కరూ బాధ్యతగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్తుకు ముప్పు తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలి..

డంప్​ యార్డు వల్ల మడికొండ, రాంపూర్​చుట్టుపక్కల వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగింది. ఈ మధ్య టెస్టు చేసిన ఆఫీసర్లు కూడా అదే చెప్పారు. పొగ, దుమ్ము, ధూళి వల్ల మా గ్రామంలో చాలామంది శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. డంప్​ యార్డు సమస్యకు తొందరగా పరిష్కారం చూపి, కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలి.

దువ్వ నవీన్, మడికొండ గ్రామస్తుడు