- జూపార్క్, బొల్లారం, చార్మినార్ ఏరియాల్లో రికార్డు
- శ్వాస, గుండె సంబంధిత వ్యాధుల బారినపడే ప్రమాదం
- చెత్త కాల్చడం కారణంగానే ఇబ్బందులు
- పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదికలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ లో గాలి నాణ్యత తగ్గిపోతున్నది. సిటీ గాలిలో సూక్ష్మ ధూళి కణాలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్పింది. జూపార్క్, బొల్లారం, పాశమైలారం, చార్మినార్, జీడిమెట్ల, బాలానగర్ తదితర ప్రాంతాల్లోని గాలిలో పర్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) 2.5, పీఎం 10 స్థాయి ధూళి కణాలు ఎక్కువగా ఉన్నట్టు నివేదికలో పేర్కొంది.
గడిచిన నాలుగు నెలలకు సంబంధించిన డేటాను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిలీజ్ చేసింది. గాల్లో పీఎం 2.5 అతి సూక్ష్మ ధూళి కణాలు 40శాతానికి మించరాదు. పీఎం 10 సూక్ష్మ ధూళి కణాలు వంద శాతానికి మించరాదు. కానీ.. సిటీలోని చాలా జంక్షన్లలో సాధారణం కంటే ఎక్కువ ధూళి కణాలు నమోదవుతున్నట్టు రిపోర్టులో వెల్లడైంది. ఇలాగే కొనసాగితే.. సిటీ వాసులు శ్వాస, గుండె సంబంధిత, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధుల బారినపడ్తారని బోర్డు అధికారులు హెచ్చరించారు.
పీఎం 10 కంటే.. పీఎం 2.5 డేంజర్
గాల్లో ఉండే ప్రమాదకరమైన సూక్ష్మ ధూళి కణాల స్థాయిని బట్టి కాలుష్యాన్ని నిర్ధారిస్తారు. గాలిలో పీఎం 2.5, పీఎం 10 అనే రెండు రకాల కాలుష్య కారకాలుంటాయి. పీఎం 2.5 అంటే.. 2.5 మిల్లీ మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణం కలిగిన ప్రమాదకరమైన ధూళి కణాలు. వీటినే దహన ధూళి అని పిలుస్తారు. ఏవైనా వస్తువులను కాల్చినప్పుడు గాల్లోకి చేరే మసి, లోహ కణాలు ఈ కేటగిరీలోకి వస్తాయి. సిటీలో ఎక్కువగా చెత్తను కాల్చడంతో పీఎం 2.5 స్థాయి ధూళి కణాలు గాల్లో చేరుతున్నాయి. పీఎం 2.5 స్థాయి అతి సూక్ష్మ ధూళి కణాలు 40శాతానికి మించి ఉండొద్దు.
కానీ.. సనత్నగర్లో అత్యధికంగా 66శాతం నమోదైంది. బొల్లారంలో 65శాతం, పాశమైలారంలో 63 శాతం, జూపార్క్ ఏరియాల్లో 55శాతం రికార్డవుతున్నాయి. ఇక, పీఎం 10 అంటే.. 10 మిల్లీ మైక్రాన్ల పరిమాణం ఉన్న ప్రమాదకరమైన దుమ్మూ, ధూళి కణాలు ఇందులో వస్తాయి. పీఎం 10 కంటే.. పీఎం 2.5 ఎక్కువ ప్రమాదకరం. పీఎం 10 స్థాయి సూక్ష్మ ధూళి కణాలు వంద శాతానికి మించి ఉండొద్దు. కానీ.. జూపార్క్ ఏరియాలో అత్యధికంగా 143శాతం నమోదైంది. బొల్లారంలో 111శాతం, పాశమైలారంలో 112శాతం, జీడిమెట్లలో 111శాతం, చార్మినార్ ఏరియాలో 111శాతం నమోదయ్యాయి.
పీఎం 10 సూక్ష్మ ధూళి కణాలు ఎక్కువగా నమోదైన ఏరియాలు (శాతంలో)
ప్రాంతం జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్
జూపార్క్ 104 130 143 136
బొల్లారం 111 96 101 102
పాశమైలారం 112 105 88 106
చార్మినార్ 93 87 102 111
జీడిమెట్ల 92 89 103 111
బాలానగర్ 91 88 96 109
పీఎం 2.5 అతి సూక్ష్మ ధూళి కణాలు ఎక్కువగా రికార్డయిన ప్రాంతాలు (శాతంలో)
ప్రాంతం జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్
సనత్ నగర్ 66 45 43 43
జూపార్క్ 55 39 39 39
పాశమైలారం 63 45 39 45
బొల్లారం 65 38 39 42
ఈసీఐఎల్ 33 27 32 39