అన్నీ ‘గాలి’ మాటలే సీఏక్యూఎంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

అన్నీ ‘గాలి’ మాటలే సీఏక్యూఎంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో విఫలమయ్యారని ఎయిర్  క్వాలిటీ  మేనేజ్ మెంట్  కమిషన్ (సీఏక్యూఎం) పై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంటవ్యర్థాలను తగులబెట్టడం వల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. వాయు కాలుష్యాన్ని అరికడుతున్నామని మాటలు చెబితే సరిపోదని, చేతల్లో చూపాలని పేర్కొంది. వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి కమిషన్  తీసుకున్న చర్యలపై జస్టిస్  ఆభా ఎస్ ఓకా, జస్టిస్  అగస్టీన్  జార్జ్  మాసిహ్​తో కూడిన బెంచ్ అసహనం వ్యక్తం చేసింది.

ఎన్సీఆర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలి కాలుష్యం నియంత్రణకు కమిషన్ తన అధికారాలు వినియోగించుకోవాలని సూచించింది. ‘‘వాయు కాలుష్య నియంత్రణకు సీఏక్యూఎం చర్యలు తీసుకున్న మాట నిజమే. కానీ, ఆ చర్యలు సరిపోవు. మరిన్ని చర్యలు తీసుకోవాలి. పంటవ్యర్థాలను కాల్చడానికి రైతులు ప్రత్యామ్నాయ పరికరాలు ఉపయోగించేలా చూడాలి. కేంద్రం సమకూర్చిన పరికరాలను ఉపయోగించేలా చేయాలి” అని బెంచ్  వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను బెంచ్ వచ్చే నెల మూడో తేదీకి వాయిదా వేసింది. కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదిస్తూ.. పంటవ్యర్థాల దహనాల నియంత్రణకు మార్గదర్శకాలు, అడ్వైజరీలు జారీ చేశామని తెలిపారు.

‘‘అవన్నీ గాలి మాటలు. వాయు కాలుష్యం నియంత్రణకు చర్యలే తీసుకోలేదు. నేషనల్  క్యాపిటల్  రీజియన్  రాష్ట్రాల్లో ఏమి చేశారో చెప్పనేలేదు” అని బెంచ్  తప్పుపట్టింది. పంజాబ్, హర్యానాలో పంటవ్యర్థాలు కాల్చినట్లు రిపోర్టులు అందాయని, ఈ విషయంలో ఆ రాష్ట్రాల డిప్యూటీ కమిషనర్లతో తాము సమావేశాలు నిర్వహించామని నేషనల్ క్యాపిటల్ రీజియన్ సీఏక్యూఎం చైర్మన్  రాజేశ్ వర్మ వర్చువల్​గా హాజరై తెలిపారు. చలికాలంలో ఎన్సీఆర్​లో వాయు కాలుష్యం పెరగడానికి ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంటవ్యర్థాలు కాల్చడమే కారణమని కోర్టు పేర్కొంది. వాయు కాలుష్యం నియంత్రణకు ఏ చర్యలు తీసుకుంటారో వివరిస్తూ అఫిడవిట్  దాఖలు చేయాలని సీఏక్యూఎం చైర్మన్​ను కోర్టు ఆదేశించింది.