డిసెంబర్ 8న ట్యాంక్​బండ్‎పై ఎయిర్​షో

డిసెంబర్ 8న ట్యాంక్​బండ్‎పై ఎయిర్​షో
  • ఘనంగా ప్రజాపాలన ఏడాది ఉత్సవాలు
  • ఏర్పాట్లపై సీఎస్​ శాంతి కుమారి రివ్యూ
  • 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
  • ఏర్పాట్లపై సీఎస్​ రివ్యూ

హైదరాబాద్, వెలుగు: ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా ఈ నెల7, 8, 9 తేదీల్లో  జరిగే కార్యక్రమాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్​ శాంతి కుమారి ఆదేశించారు.  శుక్రవారం సచివాలయంలో ముగింపు వేడుకల ఏర్పాట్ల పై సీఎస్​ ఉన్నతస్థాయి అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు జరిగే ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకలకు ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నదన్నారు. 

వారి కోసం తాగునీరు, టాయిలెట్స్, పారిశుధ్యం, మొదలగు సౌలతుల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ట్యాంక్ బండ్ వద్ద 8వ తేదీన జరిగే  ఎయిర్ షో కు భారత వైమానిక దళం అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. 9న సచివాలయ ప్రాంగణంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం, బహిరంగ సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. 

సభకు సీఎం, ఉప ముఖ్యమంత్రితో పాటు, మంత్రులు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను చేయాలని వివరించారు. అదే రోజు ట్యాంక్ బండ్‎పై నిర్వహించే డ్రోన్ షోకూ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రముఖ సంగీత కళాకారులు వందేమాతరం శ్రీనివాస్, రాహుల్ సిప్లీగంజ్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ల కార్యక్రమాలు ఉంటాయన్నారు. వాటికి  పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వేదికల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్  స్పష్టం చేశారు.