న్యూఢిల్లీ : విమానాల తయారీ కంపెనీ ఎయిర్‌బస్ ఇండియాలో హెచ్125 హెలీకాప్టర్ల అసెంబుల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి 8 సైట్లను గుర్తించింది. ఈ ప్లాంట్ శంకుస్థాపన ఈ ఏడాది చివరిలో ఉండే అవకాశం ఉంది. ఈ ఫైనల్ అసెంబుల్ లైన్ (ఎఫ్‌ఏఎల్) ఏడాదికి 10 హెలీకాప్టర్లను అసెంబుల్ చేస్తుందని ఎయిర్‌బస్ హెలీకాప్టర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆలివర్ మిచలన్ అన్నారు. డిమాండ్ బట్టి ప్లాంట్ కెపాసిటీ పెంచుతామని పేర్కొన్నారు. ఇండియాలో హెలీకాప్టర్లకు మంచి ఫ్యూచర్ ఉందని, ఎఫ్‌ఏఎల్ కోసం ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో శంకుస్థాపన చేస్తామని, 2026 నాటికి ప్లాంట్ అందుబాటులోకి వస్తుందని వివరించారు.
‘మొత్తం 8 సైట్లను గుర్తించాం. త్వరలో ఫైనలైజ్ చేస్తాం’ అని ఆలివర్ అన్నారు. లాజిస్టిక్స్ అవసరాలకు అనుగుణంగా ఉండి, రెగ్యులేషన్స్ భారం తక్కువగా ఉండి, ఉద్యోగులు అందుబాటులో ఉండే ఎన్విరాన్‌మెంట్‌ను కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఎయిర్‌బస్ హెచ్125 హెలీకాప్టర్లు ఎక్కువగా ఇండియా, సౌత్ ఏషియాలో అమ్ముడవుతున్నాయి. ఇండియా, చుట్టుపక్క దేశాల్లో రానున్న 20 ఏళ్లలో 500 హెలీకాప్టర్లు అవసరమవుతాయని ఎయిర్‌బస్ అంచనా వేస్తోంది. కాగా, సీ295 ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం అసెంబుల్ ప్లాంట్‌ను వడోదరా (గుజరాత్) లో ఎయిర్‌బస్ ఏర్పాటు చేస్తోంది.