హైదరాబాద్, వెలుగు: తెలంగాణతోపాటు మరో రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు తక్కువ ధరల్లో ఇంటర్నెట్ ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్, జల్దీఎయిర్ చేతులు కలిపాయి. ప్రైవేట్, పబ్లిక్, నాన్ ప్రాఫిట్ సెక్టార్లతో కలిసి హైస్పీడ్ నెట్ సేవలు అందించేందుకు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. రాబోయే మూడు సంవత్సరాల్లో ఎయిర్‌జల్డీ నెట్‌వర్క్ కొత్తగా -తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ , ఒడిశాలకు నెట్ సేవలను అందిస్తుంది. దీంతో ఎయిర్జల్దీ సేవలు అందించే రాష్ట్రాల సంఖ్య 12కు చేరుతుంది.
నెట్‌వర్క్ లొకేషన్లను 40 నుండి 62కి పెంచుతుంది. అదనంగా1,500 కిలోమీటర్ల ఫైబర్ నెట్వర్క్నిర్మించడం వల్ల 20 వేల చదరపు కిలోమీటర్ల మేర నెట్ సేవలు అందించవచ్చు. ఫలితంగా దాదాపు ఐదు లక్షల మంది గ్రామీణ పేదలకు ఇంటర్నెట్ యాక్సెస్ వస్తుంది. వైర్‌లెస్, వైర్డ్ మౌలిక సదుపాయాలను విస్తరించడం ద్వారా తొమ్మిది రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాలకు నెట్ ఇస్తున్నామని తెలిపింది. ఈ రెండు సంస్థలు కలిసి రూరల్ కనెక్టివిటీని పెంచడంతోపాటు 15 వేల మంది మహిళలను, యువతను ఎంట్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దడానికి స్కిల్స్ నేర్పిస్తాయి. ఇందుకోసం మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలను ఉపయోగిస్తారు.