- కొత్తగూడెంలో స్థల సేకరణ పనుల్లో ఆఫీసర్లు
- గరీబ్‌పేట ప్రాంతంలో స్థల పరిశీలన
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. మంగళవారం వరంగల్‌లో జరిగిన బహిరంగ సభలో కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఎయిర్ పోర్టు ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి.
ఆరేండ్ల కిందట మొదలైంది..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని ప్రజలు దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో సింగరేణి హెడ్డాఫీస్, నవభారత్, కేటీపీఎస్, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ బీపీఎల్, ఎన్ఎండీసీ లాంటి పలు పరిశ్రమలున్నాయి. పరిశ్రమలతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆరేండ్ల కిందట అప్పటి ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిని కోరారు. పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి మండలాల్లో రెవెన్యూ అధికారులు ల్యాండ్‌ను పరిశీలించారు.
ల్యాండ్‌కు సంబంధించిన వివరాలను ఎయిర్ పోర్టు అథారిటీ దృష్టికి తీసుకెళ్లారు. పాల్వంచ మండలంలోని బంగారుజాల, పేట చెరువు పరిసర ప్రాంతాల్లో ఎయిర్ పోర్టు అవసరమైన ల్యాండ్‌ను ఆఫీసర్లు సెలెక్ట్ చేశారు. ఎయిర్ పోర్టు అథారిటీ వాళ్లు ల్యాండ్‌ను పరిశీలించి వెళ్లారు. కానీ బీఆర్ఎస్ సర్కార్ పెద్దగా పట్టించుకోకపోవడంతో ఎయిర్ పోర్టు ఏర్పాటు ముచ్చట మూలకు పడింది. ఇటీవల ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై జిల్లా మంత్రులతో పాటు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జిల్లా ఇన్చార్జి మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా కేంద్రానికి లేఖ రాశారు.
గరీబ్ పేటలో స్థలపరిశీలన..
ఎయిర్ పోర్టు ఏర్పాటుకు కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల సరిహద్దు ప్రాంతంలోని గరీబ్ పేట పరిసర ప్రాంతాల్లో ల్యాండ్‌ను ఇటీవల ఎమ్మెల్యేతో పాటు రెవెన్యూ ఆఫీసర్లు పరిశీలించారు. దాదాపు 600 నుంచి 900ఎకరాల వరకు ల్యాండ్ ఉన్నట్టుగా గుర్తించారు. దాదాపు 300 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్, దాదాపు 300 నుంచి 400 ఎకరాలకు పైగా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నట్టుగా తెలిసింది. మరోసారి పూర్తి స్థాయిలో ల్యాండ్‌పై సర్వే నిర్వహించనున్నారు. ల్యాండ్ గుర్తించిన తర్వాత పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రపోజల్స్ పంపనుంది.
సీఎం ఇంట్రస్ట్.. మినిస్టర్ల ఫోకస్
కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. వరంగల్‌తో పాటు కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు ఏర్పాట్లకు సంబంధించి కేంద్ర పౌర విమానయాన శాఖతో చర్చించాలని మంత్రులకు సీఎం సూచించారు. కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు,పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పెషల్ ఫోకస్ పెట్టారు.
ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో ఉపయోగాలు..
జిల్లాలో ఎయిర్ పోర్టు ఏర్పాటుతో భద్రాచలంలోని సీతారామ చంద్ర స్వామి టెంపుల్‌కు దేశ వ్యాప్తంగా భక్తులతో పర్యాటకులు పెరిగే అవకాశం ఉంది.
గోదావరి వరదల టైంలో హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేందుకు సులువుగా ఉంటుంది. వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్ల ల్యాండింగ్ కోసం కొత్తగూడెం, భద్రాచలంలోని క్రీడా మైదానాల్లో టెంపరరీ ఏర్పాట్లు చేస్తుండడంతోప్లే గ్రౌండ్స్ దెబ్బతింటున్నాయని క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మావోయిస్టుల ఏరివేతలో భాగంగా సైనిక హెలికాప్టర్లు తరుచూ జిల్లాకు వస్తుంటాయి. దీనికి ఉపయోగకరంగా ఉంటుంది.