కొత్తగూడెంలోనూ ఎయిర్​పోర్ట్! వరంగల్ ఎయిర్​పోర్టు రెండున్నరేండ్లలో పూర్తి చేస్తం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

కొత్తగూడెంలోనూ ఎయిర్​పోర్ట్!  వరంగల్ ఎయిర్​పోర్టు రెండున్నరేండ్లలో పూర్తి చేస్తం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
  • సాధ్యాసాధ్యాలపై స్టడీ కొనసాగుతున్నది:
  • ఈ ఎయిర్​పోర్టుకు గతంలో కేసీఆర్ సర్కార్ సహకరించలే 
  • ఏప్రిల్​లో హైదరాబాద్​ టు శ్రీశైలం సీ ప్లేన్ ప్రారంభిస్తమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో వరంగల్​తో పాటు భద్రాద్రి కొత్తగూడెంలోనూ ఎయిర్​పోర్ట్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆదివారం హైదరాబాద్ కవాడిగూడ సీజీవో టవర్స్​లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డితో కలిసి 2025--–26 కేంద్ర బడ్జెట్​కు సంబంధించిన మ్యాగజైన్ రిలీజ్ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్తగూడెంలో తొలుత తమకు చూపించిన స్థలంలో కొండలు, గుట్టల వల్ల ఎయిర్​పోర్టు నిర్మాణానికి అనువుగా లేదని టెక్నికల్ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. 

తర్వాత మరో స్థలాన్ని చూపించారని, అక్కడ ఎయిర్ పోర్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కొనసాగుతోందని చెప్పారు. ఇక్కడ కూడా కొన్ని ఎర్రర్స్ ఉన్నట్టు తేలిందన్నారు. అయితే, పూర్తి స్థాయి అధ్యయనం తర్వాత అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. ఇక మామునూరు ఎయిర్ పోర్ట్ కు సంబంధించి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద 696 ఎకరాల స్థలం ఉందని, మరో 280 ఎకరాల స్థలం కావాల్సి ఉందన్నారు. ప్రస్తుత రన్ వే 1,600 మీటర్లు ఉందని, ఎయిర్ బస్ లాంటి విమానాలకు 2,800 మీటర్ల రన్ వే అవసరమని తెలిపారు. 

గతంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలే.. 

గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉడాన్ స్కీమ్ కింద మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ప్రయత్నాలు చేశారని, కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపడుతున్నామని, కాకతీయుల చరిత్ర చాటిచెప్పేలా టెర్మినల్ బిల్డింగ్ ఉంటుందన్నారు. 2014లో దేశంలో 76 ఎయిర్​పోర్టులు ఉంటే.. మోదీ ప్రధాని అయ్యాక ఆ సంఖ్య159కి పెరిగిందన్నారు. 

ఎయిర్ పోర్టు ఏర్పాటైన  ప్రాంతంలో రూపురేఖలు మారిపోతాయని, భూముల ధరలు పెరుగుతాయని, రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందన్నారు. వరంగల్ ఎడ్యుకేషన్​కు కేంద్రమని.. టెక్స్ టైల్ పార్క్​తో పాటు ఇతర పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయన్నారు. భూసేకరణ పూర్తయ్యాక ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి మూడేండ్ల టైమ్​ పడుతుందని, కానీ కేంద్రం ప్రత్యేక ఫోకస్ పెట్టినందున రెండున్నరేండ్లలోనే పూర్తి చేస్తామన్నారు.  

ఏప్రిల్​లో హైదరాబాద్ నుంచి సీ ప్లేన్..  

మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి జీఎంఆర్ కూడా ఎలాంటి ఆబ్జెక్షన్ చెప్పలేదని రామ్మోహన్ నాయుడు తెలిపారు. మామునూరును ముందుగా డొమెస్టిక్, కార్గో సర్వీసులకు వినియోగిస్తామని, ఆ తర్వాత డిమాండ్​ను బట్టి ఇంటర్నేషనల్ సర్వీసులు ప్రారంభిస్తామని వివరించారు. తెలంగాణలో ఏరో స్పేస్ పరిశ్రమ ఏర్పాటుకూ కేంద్రం ప్లాన్ చేస్తోందని చెప్పారు.శంషాబాద్ ఎయిర్ పోర్టులో త్వరలో ఉడాన్ యాత్రి కేఫ్ ఏర్పాటు చేస్తామని  కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. త్వరలో బేగంపేట విమానాశ్రయం నుంచి కూడా విమానాల రాకపోకలు ప్రారంభిస్తామని చెప్పారు. కొత్తగా 1,700 విమానాలు రానున్నాయన్నారు. అలాగే హైదరాబాద్ టు శ్రీశైలం సీ ప్లేన్​ను ఏప్రిల్​లో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 

మామునూరుపై కేసీఆర్​తో చర్చించాం: కిషన్ రెడ్డి 

మామునూరులో ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం గతంలో అప్పటి సీఎం కేసీఆర్ తో అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా చర్చించారని కిషన్ రెడ్డి తెలిపారు. మామునూరు ఎయిర్ పోర్టు ఒకప్పుడు దక్షిణాసియాలోనే అతిపెద్ద ఎయిర్ పోర్టుగా ఉండేదన్నారు. ప్రస్తుతం ఏపీలో ఏడు ఎయిర్ పోర్టులు ఉన్నాయని, తెలంగాణలో మామునూరు రెండో ఎయిర్ పోర్టు అవుతుందన్నారు.