ఎయిర్​టెల్​ పేమెంట్స్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. మహిళలకే ప్రాధాన్యం

ఎయిర్​టెల్​ పేమెంట్స్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. మహిళలకే ప్రాధాన్యం

హైదరాబాద్, వెలుగు:  మనదేశంలో అందరికీ ఆర్థిక సేవలు అందించడంలో మహిళల పాత్ర కీలకమైనదని, అందుకే వారిని పెద్ద ఎత్తున బిజినెస్​కరస్పాండెంట్లుగా (బీసీలు) నియమించుకుంటున్నామని ఎయిర్​టెల్​ పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పినాక్ చక్రవర్తి చెప్పారు.అన్ని విధాలా అభివృద్ధి చెందేందుకు అవకాశాలను కల్పిస్తున్నామన్నారు.

మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్​లో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణకు చెందిన మహిళా బిజినెస్ కరస్పాండెంట్లను (బీసీలు) బ్యాంక్ సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు మరింత సమర్థవంతంగా బిజినెస్​ చేయడానికి  పలు రకాలుగా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.  

ఖాతా తెరవడం, నగదు ఉపసంహరణలు, నగదు బదిలీలు, బిల్లు చెల్లింపులు, బీమా కొనుగోలు వంటి సేవలను వీళ్లు అందిస్తారని తెలిపారు. తమ సంస్థ దేశవ్యాప్తంగా ఐదు లక్షలకుపైగా బ్యాంకింగ్ పాయింట్లను నిర్వహిస్తోందని చెప్పారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను అందిస్తోందన్నారు.  తెలంగాణలో తమకు దాదాపు 15 వేల మంది బిజినెస్ కరస్పాండెంట్లు ఉండగా, వారిలో 3,000 మందికి పైగా మహిళలు ఉన్నారని చక్రవర్తి వెల్లడించారు.