సామాన్యులపై టెలిఫోన్ సర్వీస్ చార్జీల మోత

సామాన్యులపై టెలిఫోన్ సర్వీస్ చార్జీల మోత

టెలికమ్యూనికేషన్ రంగం శాస్త్ర సాంకేతిక రంగాలలో కొత్త పుంతలు తొక్కడంతో అనేక రకాలైన సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.  ముఖ్యంగా 2016లో రిలయన్స్ జియో తీసుకువచ్చిన ప్రభంజనంతో మొబైల్ ఫోన్లవ్యాప్తి గణనీయంగా పెరిగింది. జియో ప్రారంభానికి ముందు  ఫోన్ కేవలం కమ్యూనికేషన్ సాధనంగా మాత్రమే ఉండేది. ఎప్పుడైతే 3జీ, 4జీ టెలికం సేవలు అందుబాటులోకి వచ్చాయో ప్రజలు సమాచారం, విజ్ఞాన, వినోద  కార్యక్రమాలు, సోషల్ మీడియా రూపంలో చాలా దగ్గరయ్యారు. ఇంటర్నెట్ సబ్ స్ర్కైబర్ల పరంగా భారత్ రెండో స్థానంలో ఉంది. 

ప్రపంచవ్యాప్తంగా డేటాను అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. 2019లో గూగుల్ పేకు భారతదేశం రెండవ అతిపెద్ద మార్కెట్. 2018 నుంచి 2022 మధ్య 11% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)తో  పెరుగుతుందని అంచనా.  భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికమ్యూనికేషన్ మార్కెట్. 2023 డిసెంబర్ నాటికి టెలీ డెన్సిటీ 85.23 శాతంగా ఉంది. 2023 డిసెంబర్​లో భారత్​లో మొత్తం టెలిఫోన్ సబ్​స్ర్కైబర్ల సంఖ్య 1,190.33 మిలియన్లుగా,  2023 డిసెంబర్ నాటికి వైర్లెస్ సబ్​స్ర్కైబర్ల సంఖ్య 1,158.49 మిలియన్లుగా ఉంది.  ప్రస్తుతం టెలిఫోన్ సేవలు ప్రజల జీవన విధానంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఇంటర్నెట్ లేకపోతే గడపలేని పరిస్థితి

నేడు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఇంటర్నెట్ లేకుండా గడపలేని పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 2023 నాటికి జియో వైర్లెస్ సబ్​స్ర్కైబర్ల  సంఖ్య 459.81 మిలియన్లు కాగా, భారతీ ఎయిర్​టెల్​ (257.37 మిలియన్లు), వొడాఫోన్ ఐడియా 127.28 మిలియన్లు,  బీఎస్ఎన్ఎల్ (21.28 మిలియన్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  2020లో  ప్రపంచవ్యాప్తంగా యాప్ వినియోగంలో భారత్ వాటా 14 శాతంగా ఉంది. 2022లో భారతీయులు తమ మొబైల్స్​లో 28 బిలియన్లకు పైగా యాప్స్​ డౌన్​లోడ్​ చేసుకున్నారు.  ప్రపంచవ్యాప్తంగా 625 బిలియన్  డౌన్​లోడ్​లో 5% వాటా కలిగి ఉన్నారు. దేశంలో యాప్ డౌన్​లోడ్లు​ 2017లో 12.07 బిలియన్ల నుంచి 2019 లో 19 బిలియన్లకు పెరిగాయి. 2016కు ముందు పేదలకు సైతం ఫోను సదుపాయం ఉన్నప్పటికీ కేవలం కమ్యూనికేషన్ సాధనంగా మాత్రమే ఉండేది.  మొదట్లో పేదలు చిన్నచిన్న రీచార్జీలు ఐదు, పది రూపాయలు చేసుకొని టెలిఫోన్ సేవలను పొందేవారు. కాలక్రమేణా టెలిఫోన్ సేవలు, సమాచారంతోపాటు డేటా వినియోగం పెరగడంతో, టెలిఫోన్ బిల్లుల ఖర్చు కూడా క్రమక్రమంగా పెరుగుతూ వచ్చాయి.

పెరిగిన ఇంటర్నెట్​ వినియోగం

నేడు టెలిఫోన్ సౌకర్యం ద్వారా ఇంటర్నెట్ వాడకం పెరిగి పెద్ద ఎత్తున డేటాను వినియోగిస్తున్నారు. భారతదేశంలో మొత్తం వైర్లెస్ డేటా వినియోగం జూన్ 2023లో 44,967 (పెటాబైట్) పిబి నుంచి 2023 సెప్టెంబర్ నాటికి 47,629 పిబికి 5.9% చొప్పున పెరిగింది. మొత్తం డేటా వైర్లెస్ వినియోగంలో 2జీ డేటా వినియోగం 46 పీబీ, 3జీ డేటా వినియోగం 353 పీబీ, 4జీ డేటా వినియోగం 42,505, 5జీ డేటా వినియోగం 2,063 పీబీగా ఉంది. వైర్లెస్ డేటా వినియోగంలో 2జీ, 3జీ, 4జీ, 5జీ డేటా వినియోగం వాటా 0.10 శాతం, 0.78 శాతం, 94.53 శాతం, 4.59 శాతంగా ఉంది.  ప్రపంచ దేశాలలో ఇంటర్నెట్ వినియోగంలో భారతదేశం అత్యంత వేగంగా దూసుకెళ్తోంది. 

పరిశోధనలను ప్రభుత్వం ప్రోత్సహించాలి

ప్రజల జీవన ప్రమాణంలో మార్పులు తీసుకురావడంలో కీలక పాత్ర వహించే వ్యవస్థ ఇది. కాబట్టి ఇవి సామాన్యుడికి అందుబాటులో ఉన్నట్లయితే వారికి మరింత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా టెలిఫోన్ ఆపరేటింగ్ సంస్థలు, కేవలం ఫోన్ సదుపాయం కోసం సర్వీసులు కోరేవారికి ఒకరేటు,  టెలిఫోన్ సేవలతో పాటు ఇంటర్నెట్ సేవలను కనీసంగా వినియోగించేవారికి మరొక రేటు,  పూర్తిస్థాయి టెలిఫోన్ సేవలు,  గరిష్టంగా డేటాను వినియోగించుకునే వినియోగదారులకు మరొకరకమైన రేటును స్లాబ్​లను తీసుకువచ్చినట్లైతే సామాన్యులపైన కొంత భారం తగ్గించే అవకాశం ఉంటుంది.  2024 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో టెలికాం రంగం స్థూల ఆదాయం రూ.82,741 కోట్లు (9.99 బిలియన్ డాలర్లు)గా నమోదైంది.. టెలికాం రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్​డీఐ) పరిమితి 74 శాతం నుంచి 100 శాతానికి పెరిగింది.  

టెలికమ్యూనికేషన్స్ రంగంలో మునుపటి 49% నుంచి 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 2021 అక్టోబర్లో ప్రభుత్వం నోటిఫై చేసింది. ఏప్రిల్ 2000-–డిసెంబర్ 2023 మధ్య టెలికాం రంగంలో ఎఫ్​డీఐల ప్రవాహం 39.31 బిలియన్ డాలర్లుగా ఉంది.  ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు భారతదేశంలో  టెలికాం సేవల ధరలు నేటికీ కూడా తక్కువగా ఉండడం గమనించదగిన విషయం అయినప్పటికీ,  నాణ్యమైన సేవలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం టెలికాం  కంపెనీలకు కూడా ప్రోత్సాహకాలను అందించాల్సిన అవసరం ఉంది.  శాస్త్ర, సాంకేతిక రంగాల పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అతి తక్కువ ఖర్చుతో టెలికాం సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేవిధంగా పరిశోధనలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

ఒక్కో కుటుంబంపై రూ.500 అదనపు భారం

2016లో జియో సేవలు ఉచితంగా అందించడంతో ఒక్కసారిగా మిగతా టెలిఫోన్ ఆపరేటర్లు, చిన్న చిన్న సంస్థలు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత కాలంలో జియో తక్కువ చార్జీలతో సేవలను ప్రజలకు అందిస్తూ రావడంతో ఆ పోటీని తట్టుకోలేక అనేక సంస్థలు మూతపడ్డాయి.  మరికొన్ని సంస్థలు పెద్ద సంస్థల్లో అంతర్భాగం అయిపోయాయి. 

అప్పట్లో ఎయిర్​టెల్, యూనినార్,  టెలినార్,  టాటా డొకొమో, హచ్,  ఐడియా లాంటి ఎన్నో  సంస్థలు మార్కెట్​లో  ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. ఏప్రిల్ నాటికి జియో 40 శాతానికి పైగా మార్కెట్​ను ఆక్రమించుకోగా, దాని సమీప ప్రత్యర్థి ఎయిర్ టెల్ 33.1 శాతంగా ఉంది.  నేడు రీచార్జ్​ధరలు గణనీయంగా పెరిగాయి. సరాసరి ఒక కుటుంబంలో రెండు నుంచి మూడు మొబైల్ ఫోన్లు వాడుతున్న నేపథ్యంలో ఒక్కో కుటుంబంపై దాదాపుగా 500 రూపాయలకు పైగా అదనపు భారం పడనుంది.

- చిట్టెడ్డి  కృష్ణారెడ్డి, అసిస్టెంట్​ ప్రొఫెసర్​, హెచ్​సీయూ