
Blinkit News: దేశంలో క్విక్ కామర్స్ వ్యాపారం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు కేవలం కిరాణా సరుకులు అందించటానికి, కూరగాయలు, పాలు వంటి వాటిని డెలివరీ చేసే ఈ సంస్థలు ఆ తర్వాతి కాలంలో ఎలక్ట్రానిక్స్, గోల్డ్, సిల్వర్, మెుబైల్స్, యాక్సిసరీస్, వంటి అనేక ఉత్పత్తుల కేటగిరీలకు విస్తరించాయి.
అయితే తాజాగా ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటోకి చెందిన బ్లింకిట్ మరో కొత్త సేవను అందించేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ తో జతకట్టింది. దీని కింద ఎయిర్ టెల్ తన కస్టమర్లకు కేవలం 10 నిమిషాల్లోనే ఇంటి వద్దకు సిమ్ కార్డుల డెలివరీని అందించనున్నట్లు ప్రకటించింది. దేశంలో తొలిసారిగా తీసుకొచ్చిన ఇలాంటి సేవలను ప్రస్తుతం దేశంలోని 16 నగరాల్లో అందుబాటులో ఉంచినట్లు భారతీ ఎయిర్ టెల్ వెల్లడించింది.
►ALSO READ | Mukesh Ambani: అంబానీ వ్యూహం సక్సెస్.. జేబులోకి రూ.వెయ్యి కోట్లు, తగ్గేదే లే..
కొత్త సర్వీస్ కింద వినియోగదారులు కేవలం రూ.49 చెల్లించి సిమ్ కార్డును ఆర్డర్ చేయవచ్చు. సదరు నెంబరును ఆధార్ కేవైసీ ద్వారా యాక్టివేట్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో బ్లింకిట్ కేవలం సిమ్ డెలివరీ సేవలను అందిస్తుందని, వినియోగదారులు సెల్ఫ్ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయటం ద్వారా సొంతంగా సిమ్ కార్డును యాక్టివేట్ చేసుకోవచ్చని తెలిపింది. దీని కింద ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ సిమ్ ప్లాన్లను ఎంపిక చేసుకునే వెసులుబాటును కూడా టెలికాం దిగ్గజం కల్పిస్తోన్నట్లు ప్రకటించింది. అలాగే కస్టమర్లు తాజా సేవల ద్వారా సిమ్ కార్డు పోర్టబిలిటీ సర్వీసెస్ కూడా వినియోగించుకోవచ్చని బ్లింకిట్ సీఈవో అల్బిందర్ ధిండ్సా వెల్లడించారు.
కస్టమర్లు తమ సేవలను సులువుగా పొందేలా చేసేందుకు తాము ఈ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చినట్లు ఎయిర్ టెల్ సీఈవో సిద్ధార్థ్ శర్మ వెల్లడించారు. ఇందులో భాగంగానే తాము బ్లింకిట్ తో జతకట్టినట్లు ఆయన వెల్లడించారు.