న్యూఢిల్లీ: టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో క్వార్టర్లో నికర లాభం (కన్సాలిడేటెడ్) వార్షికంగా 37.5 శాతం తగ్గి రూ. 1,341 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం రెండో క్వార్టర్లో నికర లాభం రూ.2,145 కోట్లుగా ఉంది. తాజా క్వార్టర్లో నికర ఆదాయం ఏడాది ప్రాతిపదికన 44.2 శాతం పెరిగి రూ.2,960 కోట్లకు చేరుకుంది. క్వార్టర్లీ ఆదాయం 7.3 శాతం పెరిగి రూ.37,044 కోట్లకు చేరుకుంది. భారత్ కార్యకలాపాలలో బలమైన పనితీరు కారణంగా ఆదాయం బాగా పెరిగిందని కంపెనీ ప్రకటనలో పేర్కొంది.
ఈసారి ఆదాయం బాగుండటమేగాక, మార్జిన్లు మెరుగుపడ్డాయని భారతీ ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విఠల్ అన్నారు. ఇండియా మార్కెట్ నుంచి ఆదాయం సీక్వెన్షియల్‌గా 2.4 శాతం పెరిగిందని, అయితే నైజీరియన్ కరెన్సీ నైరా విలువ తగ్గడం వల్ల అక్కడ ఆదాయంపై ప్రభావం ఉందని వివరించారు. తాజా క్వార్టర్లో కంపెనీ 77 లక్షల మంది 4జీ/5జీ చందాదారులను సంపాదించుకుంది. ఏఆర్పీయూ పెరిగిందని తెలిపింది. "మా పోస్ట్‌పెయిడ్, హోమ్‌ల వ్యాపారాలు మంచి పనితీరును కనబర్చాయి. రెండు సెగ్మెంట్లలోనూ భారీగా కస్టమర్లను సంపాదించుకున్నాం.
ఇప్పటి వరకు ఏ ఒక్క క్వార్టర్లోనూ లేనంత మంది కస్టమర్లు ఈసారి చేరారు. క్వాలిటీ కస్టమర్‌లపై దృష్టి సారించడం, వారికి ఉత్తమ అనుభవాన్ని అందించడం అనే సరళమైన, స్థిరమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నాం. ఏఆర్పీయూ గత ఏడాది రెండో క్వార్టర్‌తో పోలిస్తే ఈసారి రూ.203కు పెరిగింది” అని విఠల్అన్నారు.