గాలిమోటర్లకు చెడ్డరోజులా ?

గాలిమోటర్లకు చెడ్డరోజులా ?

జెట్ ఎయిర్‌‌‌‌వేస్ మూతబడి నెల కావొస్తోంది. దీంతో ఈ 30 రోజుల్లో ఎన్నో పరిణామాలు సంభవించాయి. జెట్ ఎయిర్‌‌‌‌వేస్ మూత పడటం, ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విమాన టిక్కెట్ ధరల పెరగడం నుంచి సంబంధిత ఇండస్ట్రీలకు వచ్చిన నష్టాల వరకు ప్రతీది ఏవియేషన్ ఇండస్ట్రీకి ప్రతికూలంగా నిలుస్తున్నాయి.

జెట్ ఎయిర్‌‌‌‌వేస్ క్రాష్‌‌ ల్యాండింగ్‌‌తో ఇండస్ట్రీకి వచ్చిన ఐదు ప్రమాదాలు…

టిక్కెట్ ధరలు పెరిగాయ్…

జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్ క్లోజ్ కావడంతో ఒక్కసారిగా విమానాల రాకపోకలు తగ్గిపోయాయి. దీంతో టిక్కెట్ ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా ట్రావెల్ సమయం దగ్గర పడుతున్న సమయంలో ధరలు చుక్కలనంటుతున్నాయి. దీంతో ప్రయాణికులు తగ్గిపోయారు. ఇది విమానయాన ఇండస్ట్రీకి ప్రతికూలంగా మారింది.   సమ్మర్ ట్రావెల్ సమయంలో జెట్ మూతపడటంతో టిక్కెట్లకు భారీగా డిమాండ్ పెరిగిందని యాత్రా.కామ్ సీపీఓ శరత్ ధాల్ అన్నారు. మిగతా క్యారియర్స్‌‌ మరిన్ని విమానాలను పెంచాలన్నారు.

ఉద్యోగాలు పోయాయ్‌‌….

గత నెలలో జెట్ ఎయిర్‌‌‌‌వేస్​ను మూసేయడంతో దాదాపు 22 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. దీంతో జెట్‌‌కు చెందిన పైలెట్లు, క్యాబిన్ క్రూ, ఇంజనీర్లు ఇతర సంస్థల్లో ఉద్యోగాల కోసం వెతుకులాటలు ప్రారంభించారు. లెండర్లు చేపట్టిన రెస్క్యూ ప్లాన్ వర్క్‌‌వుట్ అయి ఈ   సంస్థ మళ్లీ తన కార్యకలాపాలు సాగిస్తుందని సీనియర్ ఉద్యోగులు భావిస్తున్నారు.   ఇంతమంది ఉద్యోగులు ఒకేసారి రోడ్డున పడటం ఏవియేషన్ ఇండస్ట్రీకి ప్రతికూలంగానే మారింది.

తగ్గిన ఎయిర్‌‌‌‌లైన్ ఇండస్ట్రీ వృద్ధి….

అందుబాటులో ఉండే సీట్ల సంఖ్య తగ్గిపోయాయి. ఫలితంగా  ధరలు పెరిగాయి. ధరలు పెరగడంతో విమానయాన సంస్థలు మార్చి నెలలో 1.16 మిలియన్ల మంది ప్యాసెంజర్లను కోల్పోయాయి. దీంతో గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఎయిర్‌‌‌‌ ట్రాఫిక్‌‌ వృద్ధి 18.6 శాతం తగ్గింది.

బ్యాంకులకు రాని బకాయిలు…

జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్ పునరుద్ధరించడానికి బ్యాంక్‌‌లు, అప్పులిచ్చిన సంస్థలు ఎంతో ప్రయత్నిస్తున్నాయి. దానిలో లెండర్ల కన్సార్షియంగా వ్యవహరిస్తోన్న ఎస్‌‌బీఐ పాత్ర కీలకం. కానీ ఇంకా జెట్‌‌ పునరుద్ధరణపై సరియైన క్లారిటీ లేదు. 2018 మార్చి 31 నాటికి జెట్ మొత్తం రుణం రూ.5,285 కోట్లు. ట్రేడ్‌‌ పేయబుల్స్‌‌ మరో రూ.6,400 కోట్లు. కానీ ఈ బకాయిలు ఇప్పటికీ రావడం లేదు. ఈ మొత్తం పెరగడమే తప్ప తగ్గడం లేదు. సాధారణంగా సర్వీసు కంపెనీలకు తక్కువ ఫిజికల్ ఆస్తులుంటాయి. దీంతో బకాయిలను రాబట్టుకోవడంలో బ్యాంక్‌‌లకు, అప్పులిచ్చిన సంస్థలకు చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి.

సంబంధిత ఇండస్ట్రీకి వాటిల్లిన నష్టం…

జెట్ కూలడంతో, ఎయిర్‌‌‌‌పోర్ట్ ఆపరేటర్లు, ఫ్యూయల్ సప్లయిర్స్‌‌ భారీగా నష్టపోయారు. ఈ ఎయిర్‌‌‌‌లైన్ నుంచి ఎయిర్‌‌‌‌పోర్ట్ ఆపరేటర్లకు ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలు రాలేదు. ఇతర రెంటల్ రెవెన్యూ కూడా అందలేదు. ఈ ఛార్జీలే టిక్కెట్ ధరలో 10 శాతం ఉంటాయి. జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్ వల్ల ఇండస్ట్రీకి వచ్చే నష్టాలతో పాటు, ఆ సంస్థకు కూడా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.   సీఈవో వినయ్ దుబే, సీఎఫ్‌‌ఓ అమిత్‌‌ అగర్వాల్, కంపెనీ సెక్రటరీ కుల్‌‌దీప్ శర్మ , చీఫ్​ పీపుల్స్​ ఆఫీసర్​ రాహుల్​ తనేజా వంటి టాప్ మేనేజ్‌‌మెంట్‌‌ అధికారులే గుడ్‌‌బైలు చెప్పారు. తాజాగా ఎతిహాద్ నామినీ డైరెక్టర్ రాబిన్ కమార్క్ కూడా జెట్ బోర్డు నుంచి తప్పుకున్నారు. గురువారం నుంచే ఈయన రాజీనామా అమల్లోకి వస్తుందని జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్ పేర్కొంది. కమార్క్‌‌ బోర్డు నుంచి వైదొలగడంతో, ప్రస్తుతం జెట్ బోర్డులో అశోక్ చావ్లా, శరద్ శర్మ మాత్రమే మిగిలారు. 2‌‌013లో జెట్‌‌లో 24 శాతం వాటాలను కొన్నప్పుడు ఎతిహాద్‌‌ ఇద్దరు నామినీ డైరెక్టర్లు కెవిన్ నైట్, రాబిన్ కమార్క్‌‌లను జెట్ బోర్డులో నియమించింది. నరేష్ గోయల్‌‌తో పాటు కెవిన్ కూడా మార్చిలోనే జెట్‌‌ ఎయిర్​వేస్​ నుంచి తప్పుకున్నారు. ఇక ఇప్పుడు రాబిన్ కమార్క్ కూడా జెట్ బోర్డు నుంచి బయటికి వచ్చేసిన సంగతి తెలిసిందే.  మరికొందరు కూడా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

ఇండియన్ కంపెనీలు ముందుకొస్తే..

ఇండియన్ ఎయిర్‌‌‌‌లైన్స్ సంస్థలు ఎవరైనా తమతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని ముందుకొస్తే, వారితో జతకట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఖతార్ ఎయిర్‌‌‌‌వేస్ ప్రకటించింది. ప్రస్తుతం ఇండియన్ సిటీల నుంచి దోహాకు బాగా ప్రయాణికులు పెరగడంతో అదనపు సీట్ సామర్థ్యాన్ని తాత్కాలికంగా పెంచేలా అనుమతించాలని ఈ ఎయిర్‌‌‌‌లైన్ సంస్థ కోరుతోంది. ఎయిర్‌‌‌‌ ట్రాఫిక్ డిమాండ్‌‌ అందుకోవడం కోసం ఈ అదనపు సీటు సామర్థ్యాన్ని పెంచుకునేలా అనుమతించాలని కోరుతూ… ఇండియన్ అథారిటీలకు ఒక అధికారిక ప్రతిపాదనను కూడా పంపింది. 2009 నుంచి ఖతార్, ఇండియన్ ఏవియేషన్‌‌ మార్కెట్‌‌లో సీటు సామర్థ్యం పెంపు జరుగలేదు.  ఇండియన్ క్యారియర్స్‌‌తో పాటు ఇతర ఏ ఎయిర్‌‌‌‌లైన్స్‌‌తో అయినా భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఖతార్ ఎయిర్‌‌‌‌వేస్ ప్రకటించింది. ఇండియన్ క్యారియర్స్ నుంచి ఇలాంటి ప్రతిపాదన వస్తే తాము పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది.