మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా దూసుకెళ్తోంది ఐశ్వర్య లక్ష్మి. ఈ ఏడాది తను నటించిన ఎనిమిది సినిమాలు విడుదలయ్యాయి. తొమ్మిదో సినిమాగా ‘మట్టి కుస్తీ’ వస్తోంది. విష్ణు విశాల్ హీరోగా నటిస్తూ, రవితేజతో కలిసి నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 2న విడుదలవుతోన్న సందర్భంగా ఐశ్వర్య ఇలా ముచ్చటించింది. ‘‘మూడేళ్ల క్రితం ‘మట్టి కుస్తీ’ కథ విన్నాను. చాలా నచ్చింది. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ చాలెంజింగ్‌గా ఉంటుంది. ఆ పాత్రకు న్యాయం చేయలేనని అనిపించింది. ఇదే విషయం దర్శకుడికి చెప్పా. తర్వాత కొవిడ్ గ్యాప్ లో కొన్ని సినిమాలు చేయడం వలన కాన్ఫిడెన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇదొక ఫ్యామిలీ డ్రామా.
భార్యాభర్తల కుస్తీ(నవ్వుతూ). ఇద్దరి మధ్య ఉన్న ఇగో చుట్టూ కథ తిరుగుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఆడ, మగ సమానమే అనే మెసేజ్‌ను కూడా ఫన్నీగా చూపించాం. ఇందులో నాకు ఫైట్ సీన్స్ ఉన్నాయి. దీనికోసం ఫిజికల్‌గా చాలా ప్రిపేర్ అయ్యాను. ఎమోషనల్ సీన్స్ చేయడం ఇష్టం కానీ, కామెడీ నా వరకూ చాలా కష్టం. మొదటిసారి ఇందులో కామెడీని ప్రయత్నించా. విష్ణు విశాల్ స్ఫూర్తినిచ్చే వ్యక్తి. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. బెస్ట్ కోసం ప్రయత్నిస్తుంటారు. ఆయన నుండి చాలా నేర్చుకున్నా. నటుడిగా, నిర్మాతగా ఆయన ప్రయాణం అద్భుతం. రవితేజ నిర్మించడం చాలా హ్యాపీగా ఫీలయ్యాను. స్ర్కిప్ట్ సెలెక్షన్‌లో నాకు ఎలాంటి తొందరలేదు. మంచి కథ, గుర్తుపెట్టుకునే పాత్రలు చేయాలనేది నా ప్రయత్నం’’.