‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తన కెరీర్‌లోనే స్పెషల్ మూవీ అని చెబుతోంది ఐశ్వర్య రాజేష్. వెంకటేష్‌కు జంటగా ఆమె నటించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శ కత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. జనవరి 14న సినిమా విడుదల అవుతున్న సందర్భంగా ఐశ్వర్య రాజేష్ ఇలా ముచ్చటించింది.
ఓ వెబ్ సిరీస్ షూటింగ్‌లో ఉండగా అనిల్ రావిపూడి ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. అయితే ఈ క్యారెక్టర్ కోసం ఆడిషన్, లుక్ టెస్ట్ చేయాలనడంతో సర్ ప్రైజ్ అయ్యాను. ఇందులో నా పాత్రకు ఓ యాస ఉంటుంది. ఆడిషన్‌లో రెండు డైలాగ్స్ చెప్పగానే ఓకే చేశారు. నా కెరీర్‌లో ఎంతో ఎంజాయ్ చేసిన స్క్రిప్ట్ ఇదే. నా కంటే ముందు భాగ్యం పాత్ర కోసం మరికొందరిని పరిశీలించి నన్ను ఫైనల్ చేశారు. ఆ పాత్రని అర్ధం చేసుకోవడానికి నాకు పదిరోజులు పట్టింది. షూటింగ్ ప్రారంభంలో భయమేసింది. కత్తిమీద సాములాంటి పాత్ర.
కాస్త శ్రుతిమించినా ఓవర్ యాక్షన్‌లా ఉంటుంది. గతంలో రాధిక, ఊర్వశి, కోవై సరళ లాంటి వాళ్లు ఈ తరహా పాత్రలు పోషించారు. ఆ పాత్రలన్నింటినీ కలగలిపితే భాగ్యం. అందుకే చాలా బ్యాలెన్స్‌గా నటించాను. కానీ ఒక్కోసారి డైలాగులు చెప్పేటప్పుడు టెన్షన్ వచ్చేసేది. చేతులు వణికేవి. ఒకసారి ఫీవర్ కూడా వచ్చింది (నవ్వుతూ). అదీకాక వెంకటేష్ గారి కామెడీ టైమింగ్‌ను మ్యాచ్ చేయడం మామూలు విషయం కాదు.
ఆయన చాలా ప్రోత్సహించారు. అలాగే అనిల్ గారి సపోర్ట్ మర్చిపోలేను. ఇక మీనాక్షి చౌదరికి నాకు మంచి స్నేహం కుదిరింది. ఇందులో వెంకటేష్ గారిది.. మా ఇద్దరి మధ్య నలిగిపోయే క్యారెక్టర్. పాటలు హిట్ అవడంతో పాటు ట్రైలర్ అంచనాలని మరింతగా పెంచింది. పైగా ఇలాంటి ఫ్యామిలీ ఫీల్ గుడ్ సినిమా వచ్చి చాలా రోజులైంది. అందరూ ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది’’