కార్మికులపై సింగరేణి యాజమాన్యం కుట్ర : అక్బర్​ అలీ

కోల్​బెల్ట్, వెలుగు : కార్మికుల లాభాల వాటా, దసరా అడ్వాన్సులకు ఎన్నికల కోడ్​తో ముడిపెట్టడం, దానిపై టీబీజీకేఎస్​ మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తుండటం సింగరేణి యాజమాన్యం కుట్ర అని ఏఐటీయూసీ కేంద్ర కమిటీ సెక్రటరీ ఎండీ అక్బర్​ అలీ విమర్శించారు. గురువారం మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్​ ఓపెన్​ కాస్ట్​ గనిపై నిర్వహించిన గేట్​ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. సంస్థ కార్మికుల బాగు కోసం ఆలోచించకుండా రాజకీయం చేస్తూ వాటా చెల్లింపును వాయిదా వేసి రాష్ట్ర సర్కార్​కు మేలు చేస్తోందని ఆరోపించారు.

కార్మికుల కష్టార్జితంతో వస్తున్న సొమ్మును రాష్ట్ర సర్కార్ ​అక్రమంగా తరలించుకుపోతున్నా గుర్తింపు సంఘం టీబీజీకేఎస్, కోల్​బెల్ట్​ ప్రజాప్రతినిధులు అడ్డుకోవడంలేదన్నారు. ఈనెల 20న కార్మికులకు 32శాతం లాభాల వాటా, రూ.25వేల పండగ అడ్వాన్స్ చెల్లించాలని డిమాండ్​ చేశారు. లేదంటే యూనియన్​ ఆధ్వర్యంలో 23న కొత్తగూడెం కార్పొరేట్​ఆఫీస్​ను ముట్టడించి, నిరాహారదీక్ష, ఒక రోజు టోకెన్​సమ్మెకు కార్మికవర్గం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఏఐటీయూసీ బ్రాంచి వైస్ ​ప్రెసిడెంట్లు లింగయ్య, ఎ.ఆంజనేయులు, పిట్​సెక్రటరీ సిలువేరు సంపత్, లీడర్లు వి.రాజేశ్వర్​రావు, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాస్, సిద్దం బాపు, రాజేందర్, వజీర్, దైవసహయం తదితరులు పాల్గొన్నారు.