- సింగరేణికి కేసీఆర్ చేసిందేమీ లేదు : ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ సీతారామయ్య
మంచిర్యాల, వెలుగు : పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ వీ సీతారామయ్య పిలుపునిచ్చారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణతో కలిసి మంచిర్యాలలోని వివేక్ నివాసంలో శుక్రవారం సీతారామయ్య మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో సింగరేణికి చేసిందేమీ లేదని అన్నారు. కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ రద్దు, సొంతింటి కలను పట్టించుకోలేదని, కొత్త గనులను ప్రారంభించలేదని చెప్పారు.
సింగరేణిలోని 40 వేల మంది పర్మినెంట్ కార్మికులు, 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు, మరో 30 వేల మంది రిటైర్డ్ కార్మికులను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి కార్మికులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. సొంతింటి నిర్మాణానికి 250 గజాల స్థలం, రూ.15 లక్షల వడ్డీలేని లోన్ ఇవ్వడానికి హామీ ఇచ్చారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత సింగరేణి ఆధ్వర్యంలో తాడిచర్ల మైన్ ప్రారంభం
మెడికల్ అన్‌ఫిట్ ఉద్యోగాల వయోపరిమితి 35 ఏండ్ల నుంచి 40 ఏండ్లకు పెంపు వంటి హామీలు ఇచ్చారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు 44 కార్మిక చట్టాల్లో 29 రద్దు చేసిందని, కార్మికుల హక్కులు హరించుకుపోతాయన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని కోరారు. ఏఐటీయూసీ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్, టీజేఎస్ లీడర్ బాబన్న, సీనియర్ జర్నలిస్ట్ ఎండీ మునీర్ పాల్గొన్నారు.
ఇండియా కూటమిదే గెలుపు : ఎమ్మెల్యే వివేక్
లోక్‌సభ ఫస్ట్, సెకండ్ ఫేస్ ఎన్నికల్లో ఇండియా కూటమి ముందంజలో ఉన్నదని, దేశవ్యాప్తంగా కూటమి విజయం సాధిస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వంశీకృష్ణకు మద్దతుగా చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన ఉందని చెప్పారు. తెలంగాణ వచ్చేనాటికి సింగరేణిలో 62 వేల ఉద్యోగాలు ఉండగా, ప్రస్తుతం 39 వేలకు తగ్గాయన్నారు. పదేండ్లలో కేసీఆర్ 23 వేల మంది ఉద్యోగులను తొలగిస్తే.. మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ ఏనాడూ మాట్లాడలేదని విమర్శించారు.
రూ.20 వేల కోట్ల సింగరేణి ఫండ్స్‌ను పక్కదారి పట్టించినా పట్టించుకోలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఈశ్వర్‌కు ఎంపీ టికెట్ ఇచ్చారని, బీఆర్ఎస్లో మరో దళిత నాయకుడే లేడా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హైకమాండ్ సర్వే రిపోర్టుల ఆధారంగానే వంశీకృష్ణకు టికెట్ ఇచ్చిందని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ రీయింబర్స్‌మెంట్‌కు సీఎం రేవంత్‌రెడ్డితో ప్రకటన చేయిస్తామని, సొంతింటి కలను సాకారం చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో మార్పు కోసం గడ్డం వంశీకృష్ణ లాంటి యువకులను ఎంపీలుగా గెలిపించి పార్లమెంట్‌కు పంపాల్సిన అవసరముందని టీజేఎస్ లీడర్ బాబన్న అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారనిసీనియర్ జర్నలిస్ట్, సింగరేణి జేఏసీ నాయకుడు ఎండీ మునీర్ విమర్శించారు. వంశీకృష్ణ సొంతంగా కంపెనీ పెట్టి 500 మందికి ఉద్యోగాలు కల్పించారన్నారు. మచ్చలేని మనిషి, అద్భుతమైన టాలెంట్ ఉన్న వంశీని గెలిపించుకుంటేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. కార్మికులకు పెన్షన్ స్కీమ్‌ను తీసుకొచ్చింది కాకా వెంకటస్వామి అని ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్‌ప్రసాద్ తెలిపారు. పెద్దపల్లి ప్రాంతంలో సింగరేణి అనుబంధ పరిశ్రమలు రావాలంటే వంశీకృష్ణను ఎంపీగా గెలిపించాలని కోరారు.
సింగరేణి కార్మికుల ద్రోహి కేసీఆర్ : వంశీకృష్ణ
కేసీఆర్ సింగరేణి ద్రోహి అని, గత పదేండ్ల పాలనలో కార్మికులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. ఇన్కమ్ టాక్స్ రద్దు చేయలేదని, సొంతింటి నిర్మాణానికి రూ.10 లక్షల వడ్డీలేని లోన్లు ఇవ్వలేదని అన్నారు. కాంట్రాక్టు వర్కర్లకు పదేండ్లలో ఒక్క ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. సింగరేణి క్వార్టర్ల నుంచి కార్మికులను బయటకు పంపించి బీఆర్ఎస్ లీడర్లకు అప్పగించారని అన్నారు. వీటన్నింటికి సమాధానం చెప్పిన తర్వాతే కార్మికులను ఓట్లు అడగాలని బీఆర్ఎస్ను డిమాండ్ చేశారు.
సింగరేణి కష్టాల్లో ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి రూ.450 కోట్ల లోన్ ఇప్పించి, లక్ష ఉద్యోగాలను కాపాడారని చెప్పారు. జైపూర్ ఎస్టీపీపీ, రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఏర్పాటు కాకా ఘనతేనని తెలిపారు. తన సంస్థల్లో చాలామంది సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదని, సింగరేణి కార్మికులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గోదావరిఖనిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను పూర్తి చేస్తామని చెప్పారు.