
కోల్‌బెల్ట్, వెలుగు: బొగ్గు బ్లాక్‌లను దక్కించుకోవడానికి వేలంలో పాల్గొనేలా సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ లీడర్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) స్టేట్ గౌరవ అధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రటరీ రాజ్‌కుమార్ నేతృత్వంలో యూనియన్ బృందం భట్టిని కలిసింది.
సింగరేణికి చెందిన పలు అంశాలపై వారు చర్చించారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పెరుగుదలకు, నూతన ఉపాధుల కోసం కొత్త గనులను తవ్వాల్సిన అవసరం ఉందని, ఇందు కోసం సింగరేణి సంస్థ వేలంలో పాల్గొని కొత్త బ్లాక్‌లను దక్కించుకోవాల్సి ఉంటుందన్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 149 మంది జూనియర్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని కోరారు.