గోదావరిఖని, వెలుగు : సింగరేణి అండర్ గ్రౌండ్ మైన్లలో అన్‌ఫిట్ అయిన ట్రేడ్స్‌మెన్లు, మైనింగ్ స్టాప్, ఈఅండ్‌ఎం సూపర్‌వైజర్లు, ఓపెన్‌కాస్ట్‌లలో ఈపీ ఆపరేటర్లకు తగిన జాబ్ ఇవ్వాలని ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ నెల 7న మేనేజ్‌మెంట్ జారీ చేసిన సర్క్యులర్‌ను వ్యతిరేకిస్తూ మంగళవారం జీఎం ఆఫీస్ ముందు ధర్నా చేసి ఆఫీసర్లకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ అనారోగ్యంతో అన్‌ఫిట్ అయిన ఉద్యోగులకు సర్ఫేస్‌లో సేమ్ జాబ్ ఇవ్వాలని అన్ని సంఘాలు 2021 నవంబర్ 25న మేనేజ్‌మెంట్‌కు సమ్మె నోటీస్ ఇచ్చాయన్నారు. దీని ప్రకారం 2022లో అన్ని యూనియన్లతో ఒప్పందం చేసుకుని 60 రోజులలో కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని ఆఫీసర్లు చెప్పారన్నారు.
అప్పటినుంచి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతాయన్న ఉద్దేశంతో సర్క్యులర్ జారీచేశారన్నారు. లోపభూయిష్టంగా ఉన్న ప్రస్తుత సర్క్యులర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కె.స్వామి, ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం, మహేశ్, ఎస్.వెంకట్ రెడ్డి, సాయన్న, ఎం.చక్రపాణి, ప్రభుదాస్, రమేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.