- ఏఐటీయూసీ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ
కోల్‌బెల్ట్, వెలుగు : బొగ్గు బ్లాక్‌లను వేలం వేయకుండా డైరెక్ట్‌గా సింగరేణికే కేటాయించాలని ఏఐటీయూసీ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. మందమర్రి ఏరియా కేకే-5 గనిపై గురువారం నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సింగరేణిని కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని, దేశ సంపద మొత్తాన్ని వారికి అమ్మేస్తున్నారని ఆరోపించారు.
సింగరేణిని కాపాడుకునేందుకు ఉద్యమం చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం వరుసగా వేలం వేస్తుండడంతో రానున్న ఐదేళ్లలో సింగరేణి తవ్వకానికి గనులే లేకుండా పోతాయన్నారు. కార్మికుల ఐక్య పోరాటాల వల్లే సింగరేణిని కాపాడుకోవడం సాధ్యం అవుతుందన్నారు. అంతకుముందు మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఆఫీస్ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఏఐటీయూసీ స్టేట ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య
డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె.వీరభద్రయ్య, కేంద్ర కమిటీ సెక్రటరీ ఎండి.అక్బర్ అలీతో కలిసి సందర్శించి, మద్దతు తెలిపారు. గేట్ మీటింగ్‌లో యూనియన్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమనాధుని సుదర్శనం, ఇన్‌చార్జి కంది శ్రీనివాస్, పిట్ సెక్రటరీ గాండ్ల సంపత్, వైస్ ప్రెసిడెంట్ గోవిందుల రమేశ్ పాల్గొన్నారు.