నస్పూర్, వెలుగు: హైకోర్టు తీర్పు ప్రకారం సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలను ఈనెల 27వ తేదీనే నిర్వహించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఇన్చార్జ్ బోసు డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే5, ఎస్ఆర్పీ 3 గనులపై జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేయడం వల్లే కార్మికుల నుంచి వ్యతిరేకత వచ్చి అధికారం కోల్పోయిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే వాయిదా వేసే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి కార్మికులపై చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరగడంతో సంస్థ మనుగడకే ప్రమాదం పొంచిఉందన్నారు. సింగరేణిలో గత గుర్తింపు సంఘం కారణంగా అవినీతి పెరిగిందని, టీబీజీకేఎస్ మూలాన సింగరేణి భవిష్యత్తు ప్రమాదకరంగా మారిందన్నారు.
ఈ ఎన్నికల్లో ఏఐటీయూసీని గెలిపించాలని కోరారు. హక్కులు సాధించడానికి, ఉన్న హక్కులను కాపాడడానికి పాటుపడతామన్నారు. ఈ సమావేశంలో స్థానిక లీడర్లు ముస్కె సమ్మయ్య, బాజీ సైదా, మోత్కూరి కొమురయ్య, వేణుమాదవ్, ప్రసాద్ రెడ్డి, చంద్రమోహన్, నరసింగరావు, అఫ్రోజ్ ఖాన్, మురళీ చౌదరి, మల్లేశ్ పాల్గొన్నారు
27న ఎన్నికలు జరగాల్సిందే
కోల్బెల్ట్: గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను ఈనెల 27న నిర్వహించాల్సిందేనని ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు కాంపెల్లి సమ్మయ్య, సిద్దంశెట్టి రాజమొగిలి డిమాండ్ చేశారు. మందమర్రిలోని యూనియన్ఆఫీస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే మూడుసార్లు ఎన్నికలు వాయిదా పడ్డాయని, ఈసారి బ్యాలెట్ముద్రణ కూడా పూర్తయ్యిందన్నారు. గతంలో పొత్తుపెట్టుకున్న ఏఐటీయూసీ మిత్ర ద్రోహం చేసిందని.. అందుకే ఈసారి ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు.
గత గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు కార్మికుల సమస్యలు పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న కొందరు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కాంగ్రెస్సర్కార్కు తప్పుడు నివేదికలు ఇచ్చి ఐఎన్టీయూసీని అబాసుపాలు చేయడానికి ఎన్నికల వాయిదా ఆంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. సెక్రటరీ జనరల్జనక్ ప్రసాద్ సారథ్యంలో తమ యూనియన్ పటిష్టంగా ఉందని, సింగరేణి వ్యాప్తంగా ఇతర యూనియన్ల నుంచి 6 వేల మంది ఐఎన్టీయూసీలో చేరారని తెలిపారు. యూనియన్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య, సెంట్రల్కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంశెట్టి నరేందర్, మిట్ట సూర్యనారాయణ, కె.చక్రపాణి, పానుగంటి వెంకటస్వామి, కారుకూరి తిరుపతి, శనిగారపు రమణ పాల్గొన్నారు.